Share News

Deepthi Jeevanji: పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నజరానా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ABN , Publish Date - Sep 08 , 2024 | 10:12 AM

పారిస్ పారాలింపిక్స్‌-20024లో సత్తాచాటిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ.కోటి నగదు, గ్రూప్-2 ఉద్యోగంతోపాటు వరంగల్‌లో 500గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Deepthi Jeevanji: పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నజరానా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: పారిస్ పారాలింపిక్స్‌-20024లో సత్తాచాటిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ.కోటి నగదు, గ్రూప్-2 ఉద్యోగంతోపాటు వరంగల్‌లో 500గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పారాలింపిక్స్‌లో ఆమె విజయం సాధించే దిశగా నడిపించిన కోచ్‌కు సైతం రూ.10లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణకు పారాలింపిక్స్‌లో దీప్తి జీవాంజి తొలి పతకాన్ని అందించి రికార్డు సృష్టించారు. దీంతో ఆమెకు భారీ నజరానా ప్రకటించారు.


వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి పారాలింపిక్స్‌ 2024లో మహిళల 400 మీటర్ల టీ20 క్లాస్‌లో కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అథ్లెటిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించి దీప్తి చరిత్ర సృష్టించారు. అలాగే తెలంగాణ తరఫునా పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి మహిళగా ఆమె నిలిచారు. దీంతో ఆమెను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు దీప్తికి నగదు, ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరిన్ని పతకాలు సాధించే దిశగా తెలంగాణ యువతకు శిక్షణ, ప్రోత్సహాకాలు అందించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీప్తి జీవాంజికి బహుమతి ప్రకటించడంతో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Updated Date - Sep 08 , 2024 | 10:29 AM