Share News

Budget 2024-25: నేడే అసెంబ్లీలో బడ్జెట్‌..

ABN , Publish Date - Jul 25 , 2024 | 03:46 AM

రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో 2024-25 సంవత్సరానికిగాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రతిష్ఠాత్మక పథకాలు, ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కిస్తీల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకుని..

Budget 2024-25: నేడే అసెంబ్లీలో బడ్జెట్‌..

  • మధ్యాహ్నం12కు ప్రవేశపెట్టనున్న భట్టి

  • రూ.2.8-2.9 లక్షల కోట్ల మేర భారీ పద్దు

  • ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కంటే కాస్త పెరుగుదల

  • వ్యవసాయ రంగానికే అధిక నిధుల కేటాయింపు

  • మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు

  • ఉదయం 9కి క్యాబినెట్‌ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదముద్ర

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో 2024-25 సంవత్సరానికిగాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రతిష్ఠాత్మక పథకాలు, ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కిస్తీల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకుని.. దాదాపు రూ.2.8 లక్షల కోట్ల నుంచి రూ.2.9 లక్షల కోట్ల మధ్య బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిసింది. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌-1లో జరగనున్న భేటీలో బడ్జెట్‌కు క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.


ఈసారి కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు వస్తే... బడ్జెట్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్‌జీఎఫ్‌) కింద రూ.2,250 కోట్లు, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు, పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పారుదల ప్రాజెక్టుకు కేంద్ర పథకాల కింద నిధులు వస్తాయని ఆశించింది. ఈ నిధులతో కలిపి రాష్ట్ర బడ్జెట్‌ను పెంచాలనుకున్నది. కానీ.. కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపడంతో రాష్ట్ర రాబడులపైనే ఆధారపడి బడ్జెట్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్కారు రూ.2,75,891 కోట్లతో ‘ఓట్‌-ఆన్‌-అకౌంట్‌’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలల వ్యయాల కోసం రూ.78,911 కోట్లకు శాసన సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి చేసే వ్యయాలకు శాసనసభ అనుమతి పొందాల్సి ఉన్నందున ఈ నెల 31లోపు బడ్జెట్‌ను ఆమోదించుకునే దిశగా రేవంత్‌ సర్కారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది.


వ్యవ‘సాయానికి’ ఎక్కువ..

ఈ బడ్జెట్‌లో ఒక్క వ్యవసాయ రంగానికే దాదాపు రూ.50 వేల కోట్లకు పైగా కేటాయించినట్టు సమాచారం. అందులో రైతు రుణ మాఫీ పథకానికి రూ.31 వేల కోట్లు, రైతు భరోసాకు మరో రూ.15 వేల కోట్లు, రైతు బీమాకు రూ.7 వేల కోట్ల వరకు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత విద్యుత్తు, సాగునీటి పారుదల శాఖలకు నిధులను ఎక్కువగా కేటాయించినట్టు సమాచారం. విద్యుత్తు సంస్థల బకాయిల చెల్లింపు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు వంటివాటికి నిధుల కేటాయింపు దృష్ట్యా.. విద్యుత్తు శాఖకు భారీగానే కేటాయింపులు జరిపినట్లు తెలిసింది. ఇక.. రాష్ట్రంలో పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ఎత్తిపోతల పథకాలు కొనసాగుతున్న నేపథ్యంలో సాగునీటి రంగానికీ ప్రాధాన్యమిచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారెంటీలకు కూడా భారీగానే నిధులను కేటాయించినట్లు తెలిసింది.


సొంత రాబడి పైనే..

రాష్ట్ర రాబడుల్లో జీఎ్‌సటీ, విలువ ఆధారిత పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్లపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. వీటి ద్వారా వచ్చే రాబడులే రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాయని నమ్ముతోంది. బడ్జెటేతర అప్పులకు కేంద్రం మోకాలడ్డుతుండడంతో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి బడ్జెట్‌ అప్పులను తీసుకోవాల్సి వస్తోంది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.68,585 కోట్ల అప్పులు తీసుకుంటామని సర్కారు ప్రతిపాదించిందిన సంగతి విదితమే. పూర్తి స్థాయి బడ్జెట్‌లో కూడా అప్పులు అంతే ఉండనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 41 వేల కోట్లను ప్రతిపాదించింది. కానీ.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.21 వేల కోట్లనే ప్రతిపాదించింది. పూర్తి స్థాయి బడ్జెట్‌లోనూ అంతే మొత్తాన్ని ప్రతిపాదించవచ్చని తెలిసింది.

Updated Date - Jul 25 , 2024 | 06:50 AM