Share News

TG Assembly : అసెంబ్లీలో ఏం జరిగింది.. చెప్పు చూపించింది ఎవరు..

ABN , Publish Date - Dec 20 , 2024 | 10:57 AM

సభలో తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని ఆరోపించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

TG Assembly : అసెంబ్లీలో ఏం జరిగింది.. చెప్పు చూపించింది ఎవరు..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(శుక్రవారం) ఆరో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. వాయిదా తీర్మానంపై బీఆర్ఎస్ నేతలు చర్చకు పట్టుబడుతున్నారు. ఈ ఫార్ములా కార్ రేసింగ్‌పై చర్చ కోసం బీఆర్ఎస్ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారంటూ నల్ల బ్యాడ్జీలతో మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వచ్చారు. సభలో ఫార్ములా- ఈ అంశంపైన వెంటనే సభలో చర్చకు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


నల్ల బ్యాడ్జీలు, ఫ్లకార్డ్‌లతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 420కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఫార్ములా- ఈ కేసు అక్రమమని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అసెంబ్లీ రణరంగంగా మారింది.


సభలో తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని మండిపడ్డారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియం వైపు బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్లారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్, పేపర్లు విసురుకున్నారు. ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. దాంతో సభను 15 నిమిషాల పాటు అసెంబ్లీ స్పీకర్ వాయిదా వేశారు.


స్పీకర్‌పై బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేపర్ల కట్ట విసిరారని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పేపర్లు చింపి విసిరేశారు. స్పీకర్ పోడియం మెట్లపైకి హరీష్‌రావు వెళ్లారు. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైనపుకు దూసుకురావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేయి చూపించి హెచ్చరించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్‌ను అవమానించేలా సభలో వ్యవహరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


అసెంబ్లీలో ఒక్క మంత్రి కూడా ఎందుకు లేరు: హరీష్‌రావు

ఈ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఒక్క మంత్రి కూడా ఎందుకు లేరని ప్రశ్నించారు. అసెంబ్లీ అంటే మంత్రులకు ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌పై చర్చకు స్పష్టమైన హామీ ఇస్తేనే తాము సభ సాఫీగా జరగడానికి సహకరిస్తామని అన్నారు. ఒక సభ్యునిపై కేసు పెట్టారని.. సభ నడుస్తున్నప్పుడు ఆ సభ్యునికి వాస్తవం చెప్పుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. కేటీఆర్‌పై పెట్టింది ముమ్మాటికీ అక్రమ కేసే అని హరీష్‌రావు అన్నారు.


సభా సమయాన్ని వృథా చేయడం సరికాదు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్

హరీష్‌రావు వ్యాఖ్యలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడారు. కొందరు మంత్రులు శాసనమండలిలో ఉన్నారని చెప్పారు. భూభారతి బిల్లుపై చర్చ పూర్తి కానివ్వాలని అన్నారు. బిల్లుపై చర్చ పూర్తయిన తర్వాత సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒక సభ్యుని కోసం సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.


ఈ కార్ రేసింగ్ శాసనసభలో చర్చించే అంశమే కాదు: ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

ఈ కార్ రేసింగ్ శాసనసభలో చర్చించే అంశమే కాదని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గవర్నర్ ఆమోదం తెలిపి ఏసీబీ కేసు కూడా నమోదు చేసిందని గుర్తుచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Lagacharla Case: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

TG NEWS: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమందికి తీవ్ర గాయాలు

NTR Statue: ఓఆర్‌ఆర్‌ వద్ద వంద అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 20 , 2024 | 02:43 PM