Share News

Kaleshwaram Commission: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ వేగవంతం..

ABN , Publish Date - Aug 17 , 2024 | 03:35 PM

కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. దీని కోసం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Kaleshwaram Commission: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ వేగవంతం..

హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. దీని కోసం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. విచారణ ఆలస్యం కాకూడదని ఆయన రెండు వారాలపాటు నగరంలోనే మకాం వేయనున్నారు. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజినీర్లు, ప్రైవేటు వ్యక్తులకు కమిషన్ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాశ్ విచారణలో భాగంగా హైదరాబాద్‌ బీఆర్‌కే భవన్‌లోని కమిషన్ ఎదుట హాజరయ్యారు. కమిషన్ ఎదుట హాజరై పలు అంశాలపై వివరణ ఇచ్చారు.


కమిషన్ విచారణ అనంతరం బయటకు వచ్చిన జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.."కమిషన్ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇచ్చాను. తెలంగాణ భవిషత్ కోసమే అన్ని ప్రాజెక్టులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రీ-డిజైన్ చేశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కట్టాలని కేసీఆర్ మదిలో ఉండేది. కానీ మహారాష్ట్ర ఆ ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. స్టోరేజీ లేకపోవడం వల్ల తుమ్మిడిహట్టి నిర్మాణం ఆలోచన ముందుకు వెళ్లలేదు. సీడబ్ల్యూసీ చెప్పినట్లు 164టీఎంసీల్లో 64టీఎంసీలు తెలంగాణవి కాదనే విషయం రిపోర్టుల్లోనే ఉంది.


వార్ధా నది బ్యారేజీ రూ.2,500కోట్లతో నిర్మాణం అవుతుంది.. తుమ్మిడిహట్టికి రూ.7,500ఖర్చు అవుతుందని కేసీఆర్ హయాంలో అంచనా వేశాం. 'వి' ఆకారంలో బ్యారేజీ కట్టడం సాధ్యం కాదు కాబట్టే కట్టలేదు. తుమ్మిడిహట్టి వద్ద 54టీఎంసీల నీటి లభ్యతే ఉంటుందని అన్ని ఆధారాలు చూపించాను. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ, గోదావరి బేసిన్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు. నేను కమిషన్ ముందు చెప్పిన వాటిని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని అన్నారు. ఈనెల 26న సాక్ష్యాలతో సహా మళ్లీ కమిషన్ ఎదుట హాజరవుతా" అని చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి:

Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..

Updated Date - Aug 17 , 2024 | 04:21 PM