TS NEWS: ‘ధరణి’ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం: రేమండ్ పీటర్
ABN , Publish Date - Jan 22 , 2024 | 04:31 PM
‘ధరణి’లో ఉన్న సమస్యలను అర్ధం చేసుకుంటున్నామని.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ తెలిపారు.
హైదరాబాద్: ‘ధరణి’లో ఉన్న సమస్యలను అర్ధం చేసుకుంటున్నామని.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ధరణి’ లొసుగులపై చర్చిస్తున్నామని.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సమస్యలపై కొంతమంది కలెక్టర్లతో సమావేశం అవుతామన్నారు. మీ సేవలో ఉన్న సమస్యలు, అగ్రికల్చర్, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కూడా సమావేశం అవుతామని చెప్పారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. నివేదిక వచ్చాక ప్రభుత్వం ‘ధరణి’పై స్పందిస్తుందని రేమండ్ పీటర్ తెలిపారు.
‘ధరణి’ సమస్యలపై చాలామంది కోర్టుకి వెళ్లారు: సునీల్
‘ధరణి’ కమిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయదు.. మార్పులు, చేర్పులు, సలహాలు ఇస్తుందని ధరణి కమిటీ సభ్యులు సునీల్ తెలిపారు. ఇందులో ఉన్న ప్రాబ్లెమ్స్ అన్నింటిని జిల్లా పరిధిలో పరిష్కరిస్తామని చెప్పారు. ధరణి ఒక్కటే సమస్య కాదని... ఇతర డిపార్ట్‌మెంట్ అధికారులతో కూడా చర్చించాలని అన్నారు. ప్రతి రాష్ట్రంలో భూముల వివరాలను కంప్యూటర్లలో రికార్డుల్లోకి ఎక్కించారన్నారు. ‘ధరణి’ సమస్యలపై చాలామంది కోర్టుకి వెళ్లారన్నారు. రైతుకు భూమి ఉండి.. రికార్డులో భూమిని నమోదు చేయకపోతే వారు చాలా ఇబ్బంది పడుతున్నారని సునీల్ చెప్పారు.
మధ్యంతర కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఇస్తుంది: కోదండరెడ్డి
మధ్యంతర కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఇస్తుందని ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి అన్నారు. లక్షల మంది రైతులు భూమికి సంబంధించిన పాసు బుక్కులు లేకపోవడంతో వారికి లబ్ధి చేకూరడం లేదన్నారు. చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండు, మూడు అంచెలుగా ‘ధరణి’ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందని కోదండరెడ్డి అన్నారు.