Share News

IAS Officers: ఐఏఎస్‌ల కింకర్తవ్యం?

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:13 AM

కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాల ప్రకారం.. తెలంగాణను వీడి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన ఐదుగురు ఐఏఎ్‌సలు ఎ.వాణిప్రసాద్‌,

IAS Officers: ఐఏఎస్‌ల కింకర్తవ్యం?

  • 16లోగా ఏపీలో రిపోర్టు చేయాలన్న డీవోపీటీ.. కోర్టును ఆశ్రయించే అవకాశం

  • రెండు రాష్ట్రాలు అంగీకరిస్తేనే డిప్యుటేషన్‌..ముందు రిపోర్టు చేయాలని ఆలోచన

హైదరాబాద్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాల ప్రకారం.. తెలంగాణను వీడి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన ఐదుగురు ఐఏఎ్‌సలు ఎ.వాణిప్రసాద్‌, వాకాటి కరుణ, డి.రొనాల్డ్‌రాస్‌, మల్లెల ప్రశాంతి, ఆమ్రపాలి కాట, ముగ్గురు ఐపీఎ్‌సలు అంజనీకుమార్‌, అభిలాష బిస్త్‌, అభిషేక్‌ మహంతిల్లో తర్జనభర్జన మొదలైంది. ఏపీకి వెళ్లిపోవడమా? ఇతర మార్గాలను అనుసరించడమా? అని వారు మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా, డీవోపీటీ నిర్ణయాన్ని, హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లడమా, సుప్రీం కోర్టు తలుపు తట్టడమా అని ఆలోచిస్తున్నారు. డివిజన్‌ బెంచ్‌, సుప్రీంకు వెళ్లడం వీటిలో ఏది చేయాలన్నా ముందుగా ఏపీలో చేరాల్సిందేనని ఐఏఎస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎందుకంటే.. డీవోపీటీ ఇచ్చిన గడువు ఎక్కువగా లేకపోవడమే. దసరా, 13న ఆదివారం కావడంతో 14, 15 తేదీల్లో మాత్రమే కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి.


అయితే, ఇది ఈ రెండు రోజుల్లో తేలే వ్యవహారంగా కనిపించడం లేదు. దీంతోనే ముందుగా ఏపీలో చేరతారని తెలుస్తోంది. కాగా, ఏపీ వెళ్లాల్సిన ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిశారు. ఇతరత్రా మార్గాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. వాణీప్రసాద్‌కు డీవోపీటీ రాసిన లేఖలో ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఎప్పటిలోగా అని నిర్దిష్ట తేదీని పేర్కొనలేదు. దాంతో కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొంతమంది అధికారుల అంతర్రాష్ట్ర డిప్యూటేషన్‌పై చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఆమ్రపాలి కాటను ఇలా కొనసాగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం డీవోపీటీని కోరుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివి సైతం ఇప్పట్లో తేలకపోవచ్చు. దీనిపై ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పర అంగీకారానికి వచ్చి, డీవోపీటీకి లేఖ రాయాల్సి ఉంటుంది. డీవోపీటీ నిర్ణయం తీసుకోవాలంటే 15-20 రోజులు పట్టవచ్చు. కానీ, ఏపీలో చేరాల్సిన గడువు (ఈ నెల 16) ముంచుకొస్తోంది. ఈ దృష్ట్యా ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలకు తెలంగాణలో కొనసాగే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Updated Date - Oct 12 , 2024 | 03:13 AM