Share News

Mallu Bhatti Vikramarka: ఉమ్మడి జిల్లాల్లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లు..

ABN , Publish Date - Jul 07 , 2024 | 04:37 AM

గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.

Mallu Bhatti Vikramarka: ఉమ్మడి జిల్లాల్లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లు..

  • గ్రామీణ యువతకు ఉపాధి కల్పనపై దృష్టి: భట్టి

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాదిమంది బీటెక్‌ పూర్తి చేస్తున్నారని, కానీ భావవ్యక్తీకరణ నైపుణ్యం లేక ఉపాధి పొందలేకపోతున్నారని భట్టి అన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


ఈ మేరకు మంత్రి సీతక్కతో కలిసి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలపై సచివాలయంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలోని ‘ఉపాధి కల్పన, మార్కెటింగ్‌ మిషన్‌’ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చారు, వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు వంటి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో అనుసంధానం చేసుకుని యువతకు ఉపాధి కల్పించే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా వారం రోజుల్లో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు.


కాగా, ఉపాధి హామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారని, రైతులు ఉచితంగానే ఆ పూడిక మట్టిని పొలాలకు తరలించుకుపోతున్నారని భట్టి అన్నారు. అయినా, గత పదేళ్లలో మిషన్‌ కాకతీయ పేరిట రూ.25వేల కోట్లు ఎలా ఖర్చయ్యాయని అధికారులను ప్రశ్నించారు. స్వీపర్ల వేతనాలు పెండింగ్‌లో ఉంటే వెంటనే వివరాలు పంపాలన్నారు.మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఆదాయాన్ని రాబట్టి, అప్పు చెల్లిస్తామంటూ గత ప్రభుత్వం రూ.30వేల కోట్ల అప్పు తెచ్చిందని అన్నారు. కానీ, ఆదాయాన్ని సాధించడం, అప్పు చెల్లించడంలో మిషన్‌ భగీరథ కార్పొరేషన్‌ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కాగా, 60 శాతం మంది మాత్రమే మిషన్‌ భగీరథ నీటిని వినియోగిస్తున్నారని అధికారులు భట్టికి వివరించారు. ఇందుకు స్పందించిన మంత్రి మిషన్‌ భగీరథ నీటి నాణ్యత, ఆరోగ్యం తదితర అంశాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని భట్టి చెప్పారు.

Updated Date - Jul 07 , 2024 | 04:37 AM