Share News

Lok Sabha Elections: రాష్ట్రంలో నోటాకు తగ్గని ప్రాధాన్యం..

ABN , Publish Date - Jun 05 , 2024 | 06:30 AM

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, బీజేపీ చెరో 8 స్థానాలు కైవసం చేసుకోగా మజ్లిస్‌ ఓ చోట గెలుపొందింది. అయినప్పటికీ ఆయా స్థానాల్లో నోటా ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదు. కొన్ని స్థానాల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తర్వాత నోటాకే ఎక్కువ ఓట్లు లభించడం విశేషం.

Lok Sabha Elections: రాష్ట్రంలో నోటాకు తగ్గని ప్రాధాన్యం..

  • అనేక చోట్ల నాలుగో స్థానం

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, బీజేపీ చెరో 8 స్థానాలు కైవసం చేసుకోగా మజ్లిస్‌ ఓ చోట గెలుపొందింది. అయినప్పటికీ ఆయా స్థానాల్లో నోటా ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదు. కొన్ని స్థానాల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తర్వాత నోటాకే ఎక్కువ ఓట్లు లభించడం విశేషం. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో డీకే అరుణకు 5,10,747 ఓట్లు రాగా, ఆమె సమీప అభ్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన చల్లా వంశీచంద్‌ రెడ్డికి 5,06,247 ఓట్లు పోలయ్యాయి. అక్కడ డీకే అరుణ 4,500 ఓట్లతో అత్యల్ప మెజార్టీతో గట్టెక్కారు. అక్కడ నోటాకు 4,330 ఓట్లు రావడం విశేషం. అక్కడి నుంచి మొత్తం 31 మంది అభ్యర్థులు పోటీచేయగా ఓట్ల పరంగా నోటా 6వ స్థానంలో నిలిచింది.


ఇతర నియోజకవర్గాల్లో పరిశీలిస్తే.. మల్కాజిగిరిలో అత్యధికంగా నోటాకు 13,366 ఓట్లు పోలయ్యాయి. అక్కడ మొత్తం 23 మంది పోటీచేయగా.. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల తర్వాత అత్యధిక ఓట్లు నోటాకే వచ్చాయి. అదిలాబాద్‌లో మొత్తం 11,762 నోటా ఓట్లు పోలయ్యాయి. అక్కడ మొత్తం 13 మంది పోటీచేయగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తర్వాత నాలుగో స్థానంలో నోటా నిలిచింది. ఖమ్మంలో 6,782, చేవెళ్లలో 6,423, సికింద్రాబాద్‌లో 5,166 నోటా ఓట్లు పోలవ్వగా అక్కడ బీఆర్‌ఎస్‌ తర్వాత నాలుగో స్థానంలో నోటా నిలిచింది.

Updated Date - Jun 05 , 2024 | 06:30 AM