Kaleshwaram Project: బ్యారేజీలపై నివేదికను అమలు చేశారా!
ABN , Publish Date - Jul 20 , 2024 | 04:21 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారణాలు తెలుసుకునేందుకుగాను తగిన పరీక్షలు చేయాలంటూ తామిచ్చిన నివేదికను అమలు చేశారా? అని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
నేడు సమగ్ర నివేదికతో సమావేశానికి రండి
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌డీఎ్‌సఏ లేఖ.. ఢిల్లీలో భేటీ
హాజరుకానున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారణాలు తెలుసుకునేందుకుగాను తగిన పరీక్షలు చేయాలంటూ తామిచ్చిన నివేదికను అమలు చేశారా? అని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ నివేదిక ప్రకారం ఏయే చర్యలు తీసుకున్నారనే అంశాలపై సమీక్షించేందుకు శనివారం న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నారు. కాగా, కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలపై వా నాకాలానికి ముందు జియో ఫిజికల్, జియో టెక్నికల్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ పరీక్షలు చేసి, నివేదిక ఇవ్వాలని ఎన్‌డీఎ్‌సఏ సూచించింది.
ఈ పరీక్షలను కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసేర్చ్ స్టేషన్(సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స), జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ)లతో చేయించాలని మే 1న ఎన్‌డీఎ్‌సఏ మధ్యంతర నివేదికను ఇచ్చింది. ఆ తరువాత.. ఈ నివేదిక అమలు ఎక్కడిదాకా వచ్చిందని ప్రశ్నిస్తూ మే 13వ తేదీతోపాటు జూన్ 25న, ఈ నెల 11న తెలంగాణకు ఎన్‌డీఎ్‌సఏ లేఖలు రాసింది. అయితే అన్నారం, సుందిళ్లలో పరీక్షల కోసం బోర్‌హోల్స్ వేస్తుండగా.. ఇసుక, నీరు బయటికి వస్తున్నాయని తెలంగాణ పేర్కొంది.
ఈ నేపథ్యంలో పరీక్షలు నిలిపివేసి చేసి, జియో టెక్నికల్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయాలు సూచించాలని తెలంగాణ ఈనెల 5న లేఖ రాసింది. దీంతో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఇప్పటిదాకా ఎన్ని బోర్‌హోల్స్/డ్రిల్లింగ్స్ చేశారు? బ్యారేజీల ఎగువ, దిగువ భాగంలో ఇప్పటిదాకా ఎన్ని డ్రిల్లింగ్ చేశారు..? వంటి అంశాలపై సమగ్ర వివరాలు అందించాలని ఎన్‌డీఎ్‌సఏ కోరింది. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ ఇచ్చిన నివేదిక, బ్యారేజీలపై అధ్యయనాలపై ఫొటోలు సహా సమగ్ర నివేదికను అందించాలని ఎన్‌డీఎ్‌సఏ నిర్దేశించింది. ఈ అంశాల ఆధారంగా శనివారం సమావేశంలో చర్చించనున్నారు.