Share News

Jagga Reddy: రాహుల్‌ గాంధీది త్యాగాల కుటుంబం!

ABN , Publish Date - Oct 03 , 2024 | 03:17 AM

‘‘ఈ దేశాన్ని 52 ఏళ్లు పాలించిన రాహుల్‌ గాంధీ కుటుంబం.. ప్రస్తుతం నివాసం ఉంటున్నది ప్రభుత్వ బంగళాలోనే. వారు సంపాదించిన ఆస్తి అదే.

Jagga Reddy: రాహుల్‌ గాంధీది త్యాగాల కుటుంబం!

  • చిల్లర కుటుంబం కేటీఆర్‌ది

  • హైడ్రాపై సీఎం రేవంత్‌ ఆచితూచి అడుగులు

  • చెరువుల్లో ఇళ్లు కడుతున్న రియల్‌ వ్యాపారులకే హైడ్రా వ్యతిరేకం

  • బీఆర్‌ఎస్‌ పాలనలో పనిచేసిన కొందరు అధికారులకు ఆ పార్టీతో ఇంకా సోపతి

  • వారి పనితనంతో మాపై మచ్చతెస్తున్నరు

  • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ దీన్ని గమనించి ముందడుగేయాలి: తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘ఈ దేశాన్ని 52 ఏళ్లు పాలించిన రాహుల్‌ గాంధీ కుటుంబం.. ప్రస్తుతం నివాసం ఉంటున్నది ప్రభుత్వ బంగళాలోనే. వారు సంపాదించిన ఆస్తి అదే. ఆ కుటుంబం గురించి ప్రజలకూ బాగా తెలుసు. అలాంటిది.. మూసీ డబ్బుల తో బతకాలని రాహుల్‌గాంధీ అనుకుంటడా?’’ అంటూ కేటీఆర్‌ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి నిలదీశారు. అందరూ కేసీఆర్‌, కేటీఆర్‌ లాగానే సంపాదిస్తారని అనుకోవద్దన్నారు. రాహుల్‌ది త్యాగాల కుటుంబమైతే కేటీఆర్‌ది చిల్లర కుటుంబమన్నారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియా సమావేశం లో జగ్గారెడ్డి మాట్లాడారు.


హైడ్రా విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారని, ప్రజలకు సంబంధించి లాభనష్టాల గురించి ఆలోచన కూడా ఆయనకు ఉంటుందని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పని చేసిన కొందరు అధికారులకు ఇంకా ఆ పార్టీతో సోపతి పోలేదన్నారు. వారు తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జాగ్రత్త చెప్పేందుకే హైడ్రాపైన ప్రకటన ఇచ్చానని చెప్పుకొచ్చారు. అలాంటి అధికారులు అత్యుత్సాహం చూపొద్దనే చెప్పానన్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ దీన్ని గమనించి ముందుకు వెళ్లాలనే మీడియా ముఖంగా సందేశం ఇచ్చానన్నారు. హైడ్రా పేదోళ్లకు వ్యతిరేకం కాదని, చెరువుల్లో ఇళ్లు కడుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకే వ్యతిరేకమని అన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మంచి అధికారే కానీ లీడర్‌ కాదని వ్యాఖ్యానించారు.


  • కేటీఆర్‌.. కొండా సురేఖకు క్షమాపణ చెప్పు!

మంత్రి కొండా సురేఖ పైన బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడి యా తప్పుగా ట్రోల్‌ చేసినందుకుగాను ఆమెకు క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి కేటీఆర్‌కు సూచించారు. ‘‘బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాను కంట్రోల్‌ చేయకపోవడం.. కేటీఆర్‌ తప్పు. కంట్రోల్‌ చేయకపోగా పుండు మీద కారం చల్లినట్లు ఆయన మాట్లాడిండు. అసలే సురేఖ అంటే ఫైర్‌! తెలిసి కూడా ఆమె జోలికి పోయావు. సురేఖతో కొట్లాడుడు అంత ఈజీ కాదు. ప్రశాంతంగా ఉన్న ఆమెను అనవసరంగా రెచ్చగొట్టి తన్నించుకుంటున్నావు’’ అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌లకు దండలు వేసిన ఆడవాళ్లనూ అలాగే చూస్తారా? అని ప్రశ్నించారు. పదేళ్లు రాజభోగాలు అనుభవించిన కేటీఆర్‌.. ఇంకో పదేళ్లు ఓపిక పట్టాల్సిందేనన్నారు. పరిపూర్ణత చెందిన నాయకునిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.


  • నటనలో పుట్టి పెరిగిన బీజేపీ నేతలు

ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నా రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు సీఎం, మంత్రులు రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల మేరకు ఏక కాలంలో రుణమాఫీ చేశారని జగ్గారెడ్డి చెప్పారు. మొత్తం రూ.18 వేల కోట్ల మేరకు రైతుల ఖాతాలో వేశారన్నారు. మిగిలిన మొత్తం డాటా సరిగా లేక ఆలస్యమవుతోందన్నారు. అయితే తెలంగాణలో రాజకీయంగా ఉనికి పెంచుకునే పనిలో పడిన బీజేపీ.. రాష్ట్రంలో రుణమాఫీ జరగలేదంటూ ఇందిరా పార్కు వద్ద దీక్ష చేసిందన్నారు. ‘‘స్విస్‌ బ్యాంకుల్లోని నల్లదనం తెచ్చి ప్రతి పేదోడి అకౌంట్లో వేస్తానన్న ప్రధాని మోదీ.. ఈ పదేళ్లలో ఒక్క పేదోడి అకౌంట్లోనైనా చిల్లి గవ్వ అయినా వేశారా? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల చొ ప్పున ఇప్పటికి 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండాలి.


దీనిపైన బీజేపీ నేతలు చర్చకు సిద్ధమా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. దీనికి సమాధానం ఉందా? రైతుల నడ్డి విరిచే నల్ల చట్టాలు తెచ్చింది నిజం కాదా? దానికి నిరసనగా దీక్షలు చేస్తున్న రైతులను వాహనంతో తొక్కి చంపిన చరిత్ర మీది కాదా? వీటన్నింటికీ తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పగలరా?’’ అంటూ నిలదీశారు. బీజేపీ వారిలా తమకు డ్రామాలు వేయడం రాదన్నారు. కాంగ్రెస్‌ నేతలు ప్రాక్టికల్‌గా ఉంటే.. బీజేపీ నేతలు నటనలో పుట్టి.. నటనలో పెరిగారని విమర్శించారు.

Updated Date - Oct 03 , 2024 | 03:17 AM