Share News

Jagga Reddy: మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి రావచ్చు.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 08 , 2024 | 10:04 PM

తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం పైసలతోనే తమ ఉమ్మడి జిల్లాలోని కొంత మంది కాంగ్రెస్ అభ్యర్థులను హరీష్ రావు ఓడగొట్టారని ఆరోపించారు.

Jagga Reddy: మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి రావచ్చు.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం పైసలతోనే తమ ఉమ్మడి జిల్లాలోని కొంత మంది కాంగ్రెస్ అభ్యర్థులను హరీష్ రావు ఓడగొట్టారని ఆరోపించారు. మేడిగడ్డ ,కాళేశ్వరం పైసలతో హరీష్ రావు నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్నారని చెప్పారు. తమ దగ్గర మంత్రిని, ముఖ్యమంత్రిని ఎవరినైనా కలవవచ్చని, కానీ బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ను కలవాలంటే నలుగురిని దాటి వెళ్ళాలని అన్నారు. అందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని చెప్పుకొచ్చారు. మొన్నటి వరకు మాట్లాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని, ఆయన కూడా కాంగ్రెస్‌లోకి రావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.


గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘‘నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఓడిపోయాను. కాళేశ్వరం పైసలతో మా ఉమ్మడి జిల్లాలో కొంత మంది కాంగ్రెస్ అభ్యర్థులను హరీష్ ఓడగొట్టాడు. ఎన్నికల్లో బీఆర్ఎస్ మమ్మల్ని టార్గెట్ చేసి పని చేసింది. శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిలను ఓడగొట్టాలని కేసీఆర్ ప్రయత్నించారు. మేడిగడ్డ, కాళేశ్వరం పైసలతో హరీష్ రావు నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్నారు. నేను ఓడిపోయిన ఓకే. పది ఏళ్ల సీఏం తోపు లీడర్ కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయాడు? సంగారెడ్డిలో రూ.60 కోట్లు, జహీరాబాద్‌లో రూ.25 కోట్లు, నర్సాపూర్‌లో రూ. 25 కోట్లు, పఠాన్‌చెరులో రూ.25 కోట్లు పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను ఓడ గొట్టారు. వచ్చే ఎన్నికల్లో మేము జాగ్రత్త పడాలి. లేదంటే కాళేశ్వరం పైసలు మళ్ళీ మా మీద ఖర్చు పెడతారు. హరీష్ పైసలు ఎక్కడ దాచి పెట్టిండో రేవంత్ రెడ్డికి చెబుతాను. ఆ పైసలు దొరకపట్టిస్తాను. ఆట ప్రారంభమైంది. అందుకే ఇరిగేషన్‌లో ఈఎన్‌సీని తీసివేశాము.’’ అని చెప్పారు.


‘‘మా దగ్గర స్వేచ్చ ఉంటుంది. మా దగ్గర మంత్రిని, ముఖ్యమంత్రిని ఎవరినైనా కలవొచ్చు. మీ పార్టీలో కేసీఆర్‌ను కలవాలంటే నలుగురిని దాటి వెళ్ళాలి. అందుకే మీ ఎమ్మేల్యేలు మా పార్టీలో చేరతారు. మొన్నటి వరకు మాట్లాడిన మల్లారెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి రావచ్చు. మమ్మల్ని పడగొట్టాలని చూస్తున్నారు కదా. మిమ్మల్ని ఎలా పడగొట్టాలని మేము కూడా ఆలోచన చేస్తాము. ప్రభుత్వం పడకొట్టడం అంటే ఇది ఏమైనా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ అనుకున్నావా? మేడిగడ్డ అంటే కల్తీ సిమెంట్ వాడారు. అందుకే అది కూలిపోయింది. కానీ మా కాంగ్రెస్ పార్టీది 135 ఏళ్ల చరిత్ర. 20 మంది ఎమ్మేల్యేలు మా పార్టీలోకి వస్తారు. జగ్గారెడ్డి అంటే ఒక బ్రాండ్. మీరు అంత కేసీఆర్ బ్రాండ్ నుంచి వచ్చిన వాళ్లు. ఏ రోజుకైనా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేది హరీష్ రావే. మీ ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఎప్పుడైనా పాటించారా? మీరు అధికారంలో ఉండి మమ్ములను గడ్డపారలతో పోలీస్‌లతో పొడిపించారు. ఇప్పుడు మేము సూదితో పొడుస్తాము. వేముల ప్రశాంత్ రెడ్డి రాజకీయంలో చిన్న వ్యక్తి. బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు ప్రజా సేవ చేయాలంటే మా పార్టీలోకి రండి. బీజేపీకి తెలంగాణలో బలం లేదు కాబట్టి. వాళ్ళ బలం కోసం ఏదైనా చేస్తారు. మెదక్ పార్లమెంట్‌లో పోటీ చేయమని అధిష్ఠానం నన్ను అడిగితే చేస్తాను. నా కుటుంబ సభ్యులకు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వమని అడగను. ’’ అని జగ్గారెడ్డి అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 08 , 2024 | 10:05 PM