Share News

JP Nadda: మభ్యపెట్టి.. అధికారంలోకి

ABN , Publish Date - Dec 08 , 2024 | 03:32 AM

ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి, మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు.

JP Nadda: మభ్యపెట్టి.. అధికారంలోకి

  • ప్రజలకు మోసపూరిత హామీలివ్వడమే కాంగ్రెస్‌ నైజం

  • తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌లో.. ఇలానే గెలిచింది

  • రేవంత్‌ సర్కారు మోసాలను ఎండగట్టేందుకే వచ్చా

  • అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు

  • రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటానికి నడుం బిగించాం

  • ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. శాశ్వతంగా ఉంటుంది

  • హైదరాబాద్‌ బహిరంగసభలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా

  • రేవంత్‌, కేసీఆర్‌ కవలలు..

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల డీఎన్‌ఏ ఒక్కటే

  • కాషాయజెండా ఎగురవేసే దాకా పోరాటం ఆపం: కిషన్‌రెడ్డి

  • మంత్రుల్లో సగం మంది అర్బన్‌ నక్సల్సే

  • ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? పాకిస్థాన్‌.. బంగ్లాదేశ్‌లోనా?: బండి సంజయ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి, మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని దించేవరకు బీజేపీ కార్యకర్తలు పోరాడుతారని హెచ్చరించారు. తెలంగాణలో ఏడాదిగా ఉన్న ప్రభుత్వం మోసాలను, అబద్ధాల పాలనను ప్రజల ముందు ఎండగట్టేందుకు తాను వచ్చానన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో బీజేపీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభలో జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీలు లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌ తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా ప్రసంగిస్తూ.. తెలంగాణతోపాటు హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటకలోనూ కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శలు గుప్పించారు. హిమాచల్‌లో కార్మికులకు పాత పింఛను పథకం, ఐదు లక్షల ఉద్యోగాలని చెప్పి మోసగించిందని, కర్ణాటకలో అంగన్‌వాడీలకు రూ.15 వేలు ఇస్తామని మోసం చేసిందన్నారు.


తెలంగాణలో ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు, రైతులకు రూ.15వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు, నిరుద్యోగులకు భృతి ఇస్తామని మోసపూరిత హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అందుకే వీరిని తాను మాయలోళ్లని అంటున్నానని ఎద్దేవా చేశారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 ఇస్తామన్న హామీ, షాదీ ముబారక్‌, తులం బంగారం, లక్ష రూపాయల నగదు ఏమైందని ప్రశ్నించారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని పేర్కొంటూ.. అధికారంలో ఉన్నంతకాలం అప్పులతో నడిపిద్దామని, ఆ తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ధోరణి ఉందని విమర్శించారు. తెలంగాణకు రూ.1.60 లక్షల కోట్లు గ్రాంట్‌గా ఇచ్చామని నడ్డా తెలిపారు. స్మార్ట్‌ సిటీలు వరంగల్‌, కరీంనగర్‌లకు రూ.27 వేల కోట్లు కేటాయించామని, వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, రైల్వేలకు ఆర్థిక సహకారం అందించామన్నారు. మూడు వందేభారత్‌ రైళ్లు, జాతీయ రహదారులు, బీబీనగర్‌లో ఎయిమ్స్‌ వంటి ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందని వెల్లడించారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉండగా, 6 రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇక శాశ్వతంగా అధికారంలోనే ఉంటుందని, ఈ మేరకు రాష్ట్రంలో కమలాన్ని వికసింపజేయాలని కార్యకర్తలకు నడ్డా పిలుపునిచ్చారు.


  • రేవంత్‌, కేసీఆర్‌ కవలలు: కిషన్‌రెడ్డి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ కవల పిల్లల్లాంటివారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ హయాంలో కనిపించిన అదే అహంకారం, అదే కుటుంబపాలన, అదే అవినీతి కాంగ్రెస్‌ పాలనలోనూ కొనసాగుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల డీఎన్‌ఏ ఒకటేనని, అవి ఒకే తానుముక్కలని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రకటించింది కానీ, అవి గాలి మాటలేనని ఏడాది పాలనలో తేలిపోయిందని విమర్శించారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేరాలన్నా, నిజమైన మార్పు రావాలన్నా బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రె్‌సను గద్దె దింపే వరకు, కాషాయ జెండా ఎగురవేసేవరకూ పోరాటం ఆపబోమని ప్రకటించారు.


  • అర్బన్‌ నక్సల్స్‌ చేతిలో రేవంత్‌ కీలుబొమ్మ

అర్బన్‌ నక్సలైట్ల చేతిలో సీఎం రేవంత్‌ కీలుబొమ్మగా మారారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గంలో సగం మంది అర్బన్‌ నక్సల్‌ భావజాలం ఉన్నవారేనని, అదే భావజాలం ఉన్న వ్యక్తిని విద్యా కమిషన్‌ ఛైర్మన్‌గా నియమించారన్నారు. ‘స్వామి వివేకానంద, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, మహాత్మ జ్యోతిబాపూలే, కొమ్రం భీం, సేవాలాల్‌ మహరాజ్‌లా మారుతారా? లేక నక్సలైట్లుగా మారుతారా? రాష్ట్ర ప్రజానీకం తేల్చుకోవాలి’ అని పేర్కొన్నారు. ‘భాగ్యనగర్‌ను మరో బంగ్లాదేశ్‌లా మార్చేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నింది. బంగ్లాదేశ్‌లో మాదిరిగా ఇక్కడ కూడా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భాగ్యనగర్‌ను మరో బంగ్లాదేశ్‌ కానివ్వబోం’ అని బండి సంజయ్‌ తేల్చి చెప్పారు. బీజేపీ ఉద్యమిస్తేనే రేవంత్‌ సీఎం అయ్యారని పేర్కొంటూ, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, సనాతనధర్మం కోసం ఎప్పుడైనా కొట్లాడారా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. ఏడాదిలో తాము 13 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు ఇచ్చినట్లు నిన్నటిదాకా టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తి చెబితే, 50 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు రేవంత్‌ పచ్చి అబద్ధాలు చెప్పారని సంజయ్‌ విమర్శించారు. ఈ ఉద్యోగాలు ఇచ్చింది పాకిస్థాన్‌లోనా? బంగ్లాదేశ్‌లోనా? అని ఎద్దేవా చేశారు. 317 జీవోపై ఎందుకు మాట్లాడటం లేదని సీఎంను నిలదీశారు. మోదీ ప్రభుత్వం పీఎంఏవై కింద నిధులు ఇస్తుంటే, ఇందిరమ్మ ఇళ్లు అనే పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల వద్ద మోదీ ఫోటో పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ అటకెక్కించిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. హామీలను అమలు చేయాల్సిందిపోయి ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. మోదీ మూడోసారి అధికారంలోకి రావడం ఇష్టంలేని కొన్ని విదేశీ శక్తులకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి వంత పాడుతున్నారని ఆరోపించారు.


  • పది నెలల్లోనే రేవంత్‌ సర్కారు అభాసుపాలు

ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ, హామీలు అమలుకాకున్నా సరేగానీ.. తమను బతకనిస్తే చాలు అన్నట్లుగా రాష్ట్రంలో ప్రజల పరిస్థితి తయారైందన్నారు. 50 మంది ఆటోడ్రైవర్లు, చేసిన పనులకు బిల్లులు రాక 48 మంది మాజీ ప్రజాప్రతినిధులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. పది నెలల్లోనే రేవంత్‌ ప్రభుత్వం ప్రజల్లో అభాసుపాలైందన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. మెదక్‌ ఎంపీ ఎం. రఘునందన్‌రావు మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏడాది పాలన కాదని, ఏడాది దినం అని దుయ్యబట్టారు. విగ్రహాల రూపాలు, పార్టీల జెండాలు మారాయే తప్ప ప్రజల జీవితాల్లో మార్పురాలేదని, బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క కుటుంబం దోచుకుంటే ఇప్పుడు డజన్ల కుటుంబాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, ఏం ఉద్ధరించారని సంబురాలు చేసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.


  • రాజాసింగ్‌ ఎక్కడ?

బీజేపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నగరానికి చెందిన ముఖ్య నాయకుడు, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాకపోవటం చర్చనీయాంశంగా మారింది.


  • ఫ్లెక్సీలు ఫుల్‌.. జనాలు నిల్‌!

బహిరంగ సభకు జనాల్ని తరలించటం కన్నా కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటుపైనే స్థానిక బీజేపీ నేతలు, కార్పొరేటర్లు ఎక్కువ దృష్టి పెట్టినట్లుందని సభకు హాజరైన పలువురు మాట్లాడుకోవటం వినిపించింది. ఫ్లెక్సీలు ఫుల్‌-జనాలు నిల్‌ అంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలే చర్చించుకున్నారు. నడ్డా ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలో చాలా భాగం ఖాళీగా కనిపించింది.

Updated Date - Dec 08 , 2024 | 03:32 AM