Share News

Kaleshwaram Project: ఇక ఐఏఎస్‌ల వంతు..

ABN , Publish Date - Jul 15 , 2024 | 03:21 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ సోమవారం పలువురు తాజా, మాజీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను విచారించనుంది.

Kaleshwaram Project: ఇక ఐఏఎస్‌ల వంతు..

5.jpg

  • నేడు కాళేశ్వరంపై ప్రస్తుత,

  • మాజీ అధికారుల విచారణ

  • పీసీ ఘోష్‌ కమిషన్‌ సమన్లు

  • మాజీ సీఎస్‌లు సోమేశ్‌కుమార్‌,

  • ఎస్‌కే జోషీకి పిలుపు

  • స్మితా సభర్వాల్‌, రజత్‌కుమార్‌,

  • కె.రామకృష్ణారావు, నాగిరెడ్డిలకూ

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ సోమవారం పలువురు తాజా, మాజీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను విచారించనుంది. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా రిటైరైన సోమేశ్‌కుమార్‌, శైలేంద్ర కుమార్‌ జోషీ ఉన్నారు. వారితోపాటు ఆర్థిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి వి.నాగిరెడ్డి, ఆ శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, మాజీ సీఎం కేసీఆర్‌ కార్యదర్శిగా పనిచేసిన స్మిత సభర్వాల్‌కూ.. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ కమిషన్‌ సమన్లు జారీ చేసింది.


తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలేంద్ర కుమార్‌ పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయన సీఎ్‌సగా నియమితులైనా నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్‌చార్జి బాధ్యతల్లో కొనసాగారు. ఆయన హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన చాలా వరకు నిర్ణయాలు జరగడంతో కమిషన్‌ ఆయన్ను పిలిపిస్తోంది. ఎస్‌కే జోషీ రిటైరైన తర్వాత కొన్ని నెలల పాటు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్‌చార్జి బాధ్యతల్లో సోమేశ్‌కుమార్‌ వ్యవహరించడంతో.. విచారణకు రావాలంటూ కమిషన్‌ ఆయననూ ఆదేశించింది. ఇక.. మాజీ సీఎం కేసీఆర్‌ కార్యదర్శిగా స్మితసభర్వాల్‌ దాదాపుగా తొమ్మిదిన్నరేళ్లపాటు పని చేశారు.


ఈ కాలంలో ఆమె కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆ హోదాలో పర్యవేక్షించారు. దీంతో ఆమెను సైతం కమిషన్‌ విచారించనుంది. ఇక.. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఆర్థిక అంశాలైన రుణాల సమీకరణ, బడ్జెట్‌ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులు తదితర వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వి.నాగిరెడ్డి, ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావునూ కమిషన్‌ విచారణకు పిలిచింది. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నిరుడు పదవీ విరమణ చేసిన రజత్‌కుమార్‌ సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీ, ఇతర వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడంతో ఆయన్ను కూడా కమిషన్‌ పిలిపించింది.


పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

ఐఏఎ్‌సలు, మాజీ ఐఏఎస్‌ అధికారుల విచారణ సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరగనుంది. ఆ తర్వాత.. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విద్యుత్‌ రంగ నిపుణుడు కె.రఘు మధ్యాహ్నం 2.30 గంటలకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన సాంకేతిక లోపాలు, అవకతవకతలపై సాక్ష్యాధారాలను సేకరించడానికి కమిషన్‌ ఆయన్ను విచారణకు పిలిచింది.

Updated Date - Jul 15 , 2024 | 03:21 AM