Bandi Sanjay: కరీంనగర్‌కు ప్రణమిల్లిన సంజయ్..
ABN , Publish Date - Jun 20 , 2024 | 03:00 AM
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ బుధవారం తొలిసారి తన నియోజకవర్గానికి చేరుకున్నారు. కరీంనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి సంజయ్‌ను గజమాలతో సత్కరించారు.
కేంద్రమంత్రిగా తొలిసారి సొంత నియోజకవర్గానికి
చేరుకోగానే నేలతల్లికి సాష్టాంగ నమస్కారం!
కార్యకర్తలు, ప్రజలకే మంత్రి పదవి అంకితం
2028లో రాష్ట్రంలో అధికారం బీజేపీదే: సంజయ్
భగత్‌నగర్/మల్యాల/బెజ్జంకి/శంషాబాద్/బర్కత్‌పుర, జూన్ 19: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ బుధవారం తొలిసారి తన నియోజకవర్గానికి చేరుకున్నారు. కరీంనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి సంజయ్‌ను గజమాలతో సత్కరించారు. కరీంనగర్ కమాన్ చౌరస్తాలో సంజయ్.. పుడమి తల్లికి ప్రణమిల్లారు. తెలంగాణ, కరీంనగర్ ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఆయన భారీ ర్యాలీతో ముందుకు కదిలారు. అనంతరం ఇంట్లో సతీమణి హారతి పట్టగా, వదినలు తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. అమ్మ ఆశీస్సులు తీసుకుని, తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. అంతకుముందు మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సంజయ్ విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడితే తనతో పాటు కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిని, జైళ్లకు వెళ్లారని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో తనతో కలిసి 155 రోజుల పాటు 1600 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్నారని గుర్తుచేశారు.పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్తా కష్టపడ్డారని, వారి శ్రమతోనే తనకు కేంద్ర మంత్రి పదవి దక్కిందని తెలిపారు. కేంద్ర మంత్రి పదవి కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలు పెట్టిన భిక్షేనని.. వారికే ఈ పదవిని అంకితం ఇస్తున్నానని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం కేవలం బీజేపీ వల్లే సాధ్యమైందని చెప్పారు. అనంతరం ఆయన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన సంజయ్.. స్వామిని దర్శించుకున్నారు.
ఎన్నికల ముందు గెలుపు కోసం కట్టిన ముడుపు విప్పి పూజలు చేశారు. కొండగట్టు అభివృద్ధికి గత పాలకులు సహకరించకలేదన్నారు. కొండగట్టు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. బుధవార రాత్రి సంజయ్ వేములవాడ రాజన్న ఆలయంలో కోడె మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేములవాడ ఆలయ అభివృద్ధి పేరుతో కేసీఆర్ దేవుడికే శఠగోపం పెట్టారని ఆరోపించారు. ఆలయ అభివృద్ధికి రూ.400 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి, దేవుడికే శఠగోపం పెట్టిన మూర్ఖపు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుందని చెప్పారు. కేంద్ర మంత్రిగా శక్తివంచన లేకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
శంషాబాద్‌లో ఘన స్వాగతం
కేంద్ర హోంశాఖ సహయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సంజయ్‌కు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సదర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. అనంతరం కరీంనగర్ వెళ్తుండగా సిద్దిపేట జిల్లాలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.