KTR: సిరిసిల్లకు పవర్‌లూమ్ క్లస్టర్ తీసుకురండి
ABN , Publish Date - Jul 12 , 2024 | 04:04 AM
ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్‌ను తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వాడుకోండి
బండి సంజయ్‌కి కేటీఆర్ లేఖ రాహుల్.. రేవంత్..
ఇద్దరిలో ఎవరు సన్నాసి? అదానీపై ద్వంద్వ వైఖరి ఎందుకు?
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్‌ఎస్ నేత
సిరిసిల్ల/హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్‌ను తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో పవర్‌లూం క్లస్టర్‌ను ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. కేంద్రమంత్రిగా సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు ఇదే సరైన సమయమని గుర్తించాలని కోరారు. గురువారం బండి సంజయ్‌కి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, సంజయ్ ఈ ప్రాంత ఎంపీగా ఐదేళ్ల క్రితం నుంచి ఉన్నా.. నేతన్నలకు నిరాశే ఎదురైందని తెలిపారు.
సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకొచ్చేందుకు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం నుంచి స్పందన లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని, ఉపాధి లేక కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంతమేర తీరతాయని, ఆత్మహత్యలు లేని సిరిసిల్లను చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
డైరీలో పోలీసుల పేర్లు.. ఎవరినీ వదిలిపెట్టం
అధికారం దక్కించుకోవడం కోసమే నిరుద్యోగ యువత, విద్యార్థులను వాడుకున్న రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి.. ఈ ఇద్దరిలో ఎవరు సన్నాసి..? సమాధానం చెప్పాలని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎ్‌సవీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రోద్బలంతో నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులపై పోలీసులు చేస్తున్న దాడులను విద్యార్థి నాయకులు తమ డైరీలో నమోదు చేసుకుంటున్నారని, తాము అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు.
ఢిల్లీ చుట్టూ రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ.. చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్‌పై లేకుంటే ఎలాగని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మహారాష్ట్రలో అదానీ విద్యుత్ సంస్థలపై నిరసన తెలిపే కాంగ్రెస్.. తెలంగాణలో అదానీకి విద్యుత్ సంస్థలను అప్పగించాలని చూస్తోందని ఈ ద్వంద్వ వైఖరి ఎందుకో రాహుల్ వివరించాలని ప్రశ్నించారు.