Share News

Minister Thummala: ప్రపంచంతో పోటీ పడేందుకే ఆ పాఠశాలలు: మంత్రి తుమ్మల..

ABN , Publish Date - Oct 11 , 2024 | 06:07 PM

ప్రపంచంతో తెలంగాణ బిడ్డలు పోటీపడేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్"కు శ్రీకారం చుట్టారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Minister Thummala: ప్రపంచంతో పోటీ పడేందుకే ఆ పాఠశాలలు: మంత్రి తుమ్మల..
Minister Thummala Nageswara Rao

ఖమ్మం: ప్రపంచంతో తెలంగాణ బిడ్డలు పోటీపడేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్"కు శ్రీకారం చుట్టారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంత ఖర్చయినా సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో నాణ్యమైన విద్య అందించేందుకు ఈ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు మంత్రి తుమ్మల ఇవాళ(శుక్రవారం) శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "ఒక్కో పాఠశాలకు రూ.350కోట్ల వరకూ ఖర్చు చేసి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం. మెుదటి విడత కింద నేడు 28 నియోజకవర్గాల్లో రూ.5వేల కోట్లతో పాఠశాలలకు శంకుస్థాపన చేశాం. రఘునాథపాలెం వద్ద అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన స్వామినారాయణ ట్రష్టు స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తోపాటు స్వామి నారాయణ ట్రస్ట్ స్కూల్ వల్ల మండల ఖ్యాతి పెరుగుతుంది. ఖమ్మం నగరంలో రానున్న రోజుల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేస్తాం.


పేదరికం నుంచి ప్రజలు శాశ్వతంగా బయటపడాలంటే మణులు, మాణిక్యాలు అవసరం లేదు. ఒక్క విద్య ఉంటే చాలు. మన దేశ బలం మనకున్న యువతే. ఇటీవల వారు గంజాయి మహమ్మారికి అలవాటు పడుతున్నారు. పిల్లలపై పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. డ్రగ్స్ బాధిత కుంటుంబాల కడుపుకోత తీర్చలేనిది. గంజాయి, డ్రగ్స్‌పై సీఎం రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఇందిరమ్మ రాజ్యంతోనే సంక్షేమ రాజ్యం సాధ్యమని ముందే చెప్పాం. రూ.18వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాం. రెండు లక్షలపైన రుణం ఉన్న రైతులకూ మాఫీ చేస్తాం. పిల్లల చదువు, రైతులకు భరోసాతో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగుతోంది" అన్నారు.


మరోవైపు నేడు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గ్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ దసరా నాలుగు కోట్ల ప్రజలందరూ సుఖశాంతులు ఇవ్వాలని సీఎం ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజునే రాష్ట్రాన్ని విద్య, వైద్య పరంగా అన్నీ విధాలుగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల పాఠశాలలను మూసివేసి అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసిందని సీఎం ఆరోపించారు. అందుకే పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు పలువురు మంత్రులు, శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Harish Rao: తెలంగాణ అంటే ఎందుకంత చిన్న చూపు.. కేంద్రానికి హరీశ్ రావు సూటి ప్రశ్న..

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి ముందు దానికి సమాధానం చెప్పాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Telangana: హీరో నాగార్జున, కొండ సురేఖ అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్

Updated Date - Oct 11 , 2024 | 06:09 PM