Share News

KTR: అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు

ABN , Publish Date - May 21 , 2024 | 03:19 AM

రాజకీయాల్లో విజయం, అధికారం ఎప్పుడూ ఏ ఒక్కరి సొత్తూ కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజాతీర్పుకు కట్టుబడి సుపరిపాలన అందించాలని సూచించారు. ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు.

KTR: అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు

  • ప్రజాతీర్పునకు కట్టుబడి సుపరిపాలన అందించాలి

  • కానీ రేవంత్‌ బృందం మళ్లీ గారడీకి బయలుదేరింది

  • 2 లక్షల ఉద్యోగాలిచ్చినా ప్రచారం చేసుకోలేకపోయాం

  • మరే రాష్ట్రంలోనైనా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు

  • నిరూపిస్తే రాజీనామా చేస్తా... కేటీఆర్‌ సవాల్‌

ఖమ్మం/కొత్తగూడెం, మే 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాజకీయాల్లో విజయం, అధికారం ఎప్పుడూ ఏ ఒక్కరి సొత్తూ కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజాతీర్పుకు కట్టుబడి సుపరిపాలన అందించాలని సూచించారు. ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, ఖమ్మంలో కేటీఆర్‌ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులతో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ మోసం చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి బృందం బయలుదేరిందని విమర్శించారు. మాయమాటలతో గారడీ చేసేందుకు వస్తున్న కాంగ్రె్‌సకు ఓటు వేయవద్దన్నారు.


అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చి రేవంత్‌ రెడ్డి ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినా చెప్పుకోలేకపోయామని కేటీఆర్‌ అన్నారు. ఏ నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చినట్లు రేవంత్‌ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, రేవంత్‌ రెడ్డి అబద్ధాలను ఎవరూ విశ్వసించడం లేదని కేటీఆర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో వరంగల్‌లో ‘టెక్‌ మహీంద్రా’ను తీసుకొస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ కంపెనీ వెళ్లిపోయిందన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ బ్లాక్‌మెయిల్‌ చేసే తీన్మార్‌ మల్లన్న లాంటి వ్యక్తిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలపెట్టిందన్నారు. విద్యావంతులు, మేధావులు వెళ్లాల్సిన శాసన మండలికి 56 కేసులతో 74 రోజులు జైలుకెళ్లిన వారిని పంపిస్తారా అని ప్రశ్నించారు.

Updated Date - May 21 , 2024 | 03:19 AM