Lok Sabha Election: కాంగ్రెస్ స్థానం పదిలం!
ABN , Publish Date - Jun 06 , 2024 | 04:24 AM
పదేళ్లు అధికారంలో ఉండి.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకున్న బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పాతాళానికి పడిపోయింది. ఆరు నెలల వ్యవధిలో ఆ పార్టీ గ్రాఫ్ గణనీయంగా తగ్గిపోంది. మరోవైపు బీజేపీ గ్రాఫ్ అనూహ్యంగా పైకి ఎగబాకింది.
అప్పుడూ.. ఇప్పుడూ 64 సెగ్మెంట్లలో ఆధిక్యం కంటోన్మెంట్ గెలుపుతో 65కు పెరిగిన బలం
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మెజారిటీల్లో..
మొదటి రెండు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ
8 నుంచి 45 స్థానాలకు పెరిగిన బీజేపీ ఆధిపత్యం
39 నుంచి 3 స్థానాలకు తగ్గిన బీఆర్‌ఎస్ బలం
గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలోనే ఎక్కువ ఓట్లు
మజ్లిస్‌కు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ మెజారిటీ
కమలం కమాల్.. కారు ఢమాల్
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో..
రాష్ట్రంలో మారిన 2 పార్టీల స్థానాలు
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పదేళ్లు అధికారంలో ఉండి.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకున్న బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పాతాళానికి పడిపోయింది. ఆరు నెలల వ్యవధిలో ఆ పార్టీ గ్రాఫ్ గణనీయంగా తగ్గిపోంది. మరోవైపు బీజేపీ గ్రాఫ్ అనూహ్యంగా పైకి ఎగబాకింది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అంతేకాదు.. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలుపుతో అసెంబ్లీలో తమ సభ్యుల సంఖ్యనూ 65కు పెంచుకుంది. మజ్లిస్ కూడా ఏడు అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ సాధించి పట్టు నిలబెట్టుకోగా.. బీఆర్‌ఎస్ మాత్రం మూడు స్థానాల్లోనే మెజారిటీ ఓట్లు సాధించగలిగింది. దీంతో మెజారిటీల పరంగా రాష్ట్రంలో నాలుగో స్థానానికి పడిపోయింది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక సెగ్మెంట్లలో మాత్రమే బీఆర్‌ఎస్ మెజార్టీ సాధించింది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలు గెలుచుకోగా, బీఆర్‌ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7 సీట్లలో, సీపీఐ ఒక సీటు గెలుచుకున్న విషయం తెలిసిందే. కానీ, తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే మాత్రం.. సీట్ల లెక్కలన్నీ తారుమారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో 3 ఎంపీ సీట్లు గెలుచుకోగా.. ఈసారి మరో ఐదు సీట్లు పెరిగాయి. 8 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకొంది.
కాంగ్రెస్ బలం యథాతథం..
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్లను పరిశీలిస్తే.. తాజాగా గెలిచిన కంటోన్మెంట్‌తో కలిపి 64 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యతను కనబరిచింది. అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ బలంలో పెద్దగా మార్పులేదు. భువనగిరి, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో ఆయా నియోజకవర్గాల్లోని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. ఇక పెద్దపల్లి, వరంగల్ స్థానాల్లో 6 చొప్పున సెగ్మెంట్లలో, జహీరాబాద్‌లో 5, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో 3, సికింద్రాబాద్, మెదక్‌లలో 2 చొప్పున అసెంబ్లీ సెగ్మెంట్లలో, ఆదిలాబాద్, కరీంనగర్, చేవెళ్లలో.. ఒక్కో సెగ్మెంట్‌లో కాంగ్రె్‌సకు ఆధిక్యం దక్కింది. అదనంగా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలోనూ గెలిచింది. అయితే సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు 1,07,429 ఓట్లు రాగా... లోక్‌సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్‌లో 84,414 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 3,988 ఓట్లు రాగా... లోక్‌సభ ఎన్నికల్లో 62,560 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎ్‌సకు అసెంబ్లీ ఎన్నికల్లోలో 74,897 ఓట్లు రాగా... ఇప్పుడు 15,958 ఓట్లే రావటం గమనార్హం.
బీఆర్‌ఎస్ ఆధిక్యం మూడు స్థానాల్లోనే...
బీఆర్‌ఎస్‌కు గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు రాగా, తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. అయితే పైగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఆధిక్యం పొందగలిగింది. అవి కూడా మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనివే! పార్టీ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో... అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు 1,11,648 ఓట్లు రాగా... లోక్‌సభ ఎన్నికల్లో 85,432 ఓట్లే వచ్చాయి. 26,216 ఓట్లు తగ్గినా... ఆధిక్యం మాత్రం గులాబీ పార్టీకే లభించింది. హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో... అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు 1,05,514 ఓట్లు రాగా... లోక్‌సభ ఎన్నికల్లో 65,501 ఓట్లు వచ్చాయి. 40,013 ఓట్లు తగ్గాయి. అయినా బీఆర్‌ఎ్‌సకే ఆధిక్యం వచ్చింది. బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 23,201 ఓట్లు వస్తే... లోక్‌సభ ఎన్నికల్లో 62,823 ఓట్లకు పెరిగాయి. కాంగ్రెస్‌కు 10 వేల ఓట్లు పెరిగాయి. ఇక కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు 97,879 ఓట్లు... ఇప్పుడు 66,714 ఓట్లు వచ్చాయి. అయినా బీఆర్‌ఎస్‌కే ఆధిక్యం లభించింది. ఇక్కడ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 50,873 ఓట్లు, కాంగ్రె్‌సకు 31,641 ఓట్లు వచ్చాయి.
కేటీఆర్ ఇలాకాలో బీజేపీకి ఆధిక్యం..
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. 2019 ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు ఆ సంఖ్యను రెట్టింపు (8) చేసుకుంది. ఏకంగా 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం సాధించింది. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో, చేవెళ్ల, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో 6 చొప్పున సెగ్మెంట్లలో, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లలో 4 చొప్పున సెగ్మెంట్లు, మెదక్, జహీరాబాద్‌లలో 2 చొప్పున, పెద్దపల్లి, వరంగల్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి మెజార్టీ లభించింది. బీఆర్‌ఎస్ నుంచి బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరగగా, కొంతమేరకు కాంగ్రెస్ ఓట్లు కూడా క్రాస్ అయ్యాయి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంటులోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. సిరిసిల్లలో బీజేపీకి 72,559 ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 18,326 ఓట్లు రాగా... ఇప్పుడు 54,231 ఓట్లు పెరిగాయి. బీఆర్‌ఎ్‌సకు అప్పుడు 89,224 ఓట్లు రాగా... ఇప్పుడు 65,811 ఓట్లు వచ్చాయి. కాంగ్రె్‌సకు అసెంబ్లీ ఎన్నికల్లో 59,557 ఓట్లు రాగా... లోక్‌సభ ఎన్నికల్లో 33,610 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలుండగా.. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం లభించింది. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో 6, సికింద్రాబాద్‌లో ఒక సెగ్మెంట్‌లో మెజారిటీ దక్కింది.