Share News

Lok Sabha Elections TG: కొందరికి మోదం.. కొందరికి ఖేదం!

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:24 AM

లోక్‌సభ ఎన్నికలు ముఖ్య నేతలు కొందరికి మోదాన్ని, మరి కొంత ఖేదాన్ని మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకా పాలమూరులో కాషాయ పార్టీ గెలిచింది. బీఆర్‌ఎస్‌ ఖిల్లా మెదక్‌లోనూ కమలం వికసించింది.

Lok Sabha Elections TG: కొందరికి మోదం.. కొందరికి ఖేదం!

  • సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలో మారిన సీన్‌

  • ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌లో మంత్రుల హవా

  • పెద్దపల్లి హస్తగతం.. బీజేపీకే కరీంనగర్‌

  • మెదక్‌లో కమల వికాసం.. గులాబీ బాస్‌కు విలాపం

హైదరాబాద్‌, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలు ముఖ్య నేతలు కొందరికి మోదాన్ని, మరి కొంత ఖేదాన్ని మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకా పాలమూరులో కాషాయ పార్టీ గెలిచింది. బీఆర్‌ఎస్‌ ఖిల్లా మెదక్‌లోనూ కమలం వికసించింది.

మూడు జిల్లాల్లో పై‘చేయి’...

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 12 సీట్లు గెలుచుకున్న కాంగ్రె్‌సకు పార్లమెంట్‌ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా... మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సీటును కాంగ్రెస్‌ గెలుచుకోలేకపోయింది. గతంలో కాంగ్రె్‌సలో ఉండి, బీజేపీలో చేరిన డీకే అరుణ ఇక్కడి నుంచి విజయం సాధించారు. మొన్న జరిగిన మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఓటమి చవి చూసింది. ఉమ్మడి పాలమూరులోని నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి విజయం సాధించడం పార్టీకి కొంచెం ఉపశమనం కలిగించింది. కాంగ్రెస్‌ కంచుకోటలుగా ఉన్న ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలు మళ్లీ హస్తం పార్టీకే జైకొట్టాయి.


ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. లోక్‌సభ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోగలిగారు. నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ ప్రతిష్ఠను మరింత పెంచుకున్నారు. నల్లగొండ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. ఉమ్మడి నల్లగొండలోని భువనగిరి స్థానాన్నీ కాంగ్రెస్‌ కైవసం చేసుకోవడం మరింత ‘చే’యూతనిచ్చింది. వరంగల్‌, మహబూబాబాద్‌ను గెలుచుకోవడం ద్వారా.. ఉమ్మడి వరంగల్‌ కాంగ్రె్‌సకు కంచుకోటేనని మంత్రులు సీతక్క, కొండా సురేఖ నిరూపించారు. కరీంనగర్‌ జిల్లాలో ఇద్దరు మంత్రులు శ్రమించినా.. అక్కడ బీజేపీ విజయం సాధించింది. అయితే.. పెద్దపల్లిలో గెలుపు వారికి కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.


కేసీఆర్‌ ఇలాకాలో కమల వికాసం

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు మెదక్‌ జిల్లా తీవ్ర నిరాశను మిగిల్చింది. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలు ఉండగా.. మెదక్‌లో కచ్చితంగా గెలుస్తామని బీఆర్‌ఎస్‌ విశ్వసించింది. కేసీఆర్‌, హరీశ్‌రావుతోపాటు కేటీఆర్‌ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయినా... ఫలితం దక్కలేదు. మెదక్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ విజయం సాధించడం బీఆర్‌ఎ్‌సకు మింగుడుపడడం లేదు. ఇదే ఉమ్మడి జిల్లాలోని జహీరాబాద్‌ కూడా బీఆర్‌ఎ్‌సను ఆదుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ గెలుపొందారు.

Updated Date - Jun 05 , 2024 | 05:24 AM