Komatireddy Venkatreddy: అమెరికా వెళ్లొచ్చేలోగా బీఆర్‌ఎస్ ఆఫీసు కూల్చేయండి
ABN , Publish Date - Aug 04 , 2024 | 03:49 AM
‘నేను అమెరికా వెళ్లి ఈనెల 11న తిరిగొస్తా.. ఈలోగా అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి’ అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
నల్లగొండ మునిసిపల్ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం
నల్లగొండ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘నేను అమెరికా వెళ్లి ఈనెల 11న తిరిగొస్తా.. ఈలోగా అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి’ అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. శనివారం నల్లగొండ మునిసిపల్ కార్యాలయ ప్రాంగణంలో నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమతులు లేకున్నా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తుంటే మునిసిపల్ అధికారులు ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు.
ఆ భవనాన్ని కూల్చేయాలని గతంలోనే ఆదేశించానని, అయినా ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా వెళ్లి ఈ నెల 11న తిరిగి వస్తానని, అప్పటిలోగా కూల్చకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2019లో అత్యంత విలువైన స్థలాన్ని చదరపు గజం రూ.100 చొప్పున నామమాత్రపు ధరకు ఎకరా భూమిని ఆ పార్టీ కార్యాలయానికి కేటాయించారు. అయితే ఈ స్థలం విలువ రూ.50 కోట్ల పైనే ఉంటుందని, ఇంత విలువైన సర్కారు భూములు పార్టీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారని మంత్రి గతంలోనే ప్రశ్నించారు.