Share News

Tummala Nageswara Rao: తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో కలిసి సాగాలి..

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:13 AM

ఇరు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయినా అభివృద్ధిలో కలిసి సాగాలని, ఎలాంటి జలవివాదాలు లేకుండా తెలుగు రాష్ట్రాలు పురోభివృద్ధి సాధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

 Tummala Nageswara Rao: తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో కలిసి సాగాలి..

  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఇరు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయినా అభివృద్ధిలో కలిసి సాగాలని, ఎలాంటి జలవివాదాలు లేకుండా తెలుగు రాష్ట్రాలు పురోభివృద్ధి సాధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు తలెత్తుకొని ఉండేలా అభివృద్ధి చెందాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆశాభావం వ్యక్తం చేసినట్లు తుమ్మల తెలిపారు. మంత్రి తుమ్మల ఆదివారం నగరంలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు రాష్ట్రాలకు మేలు కలిగే జాతీయ రహదారులు, జలవనరులు, రైల్వేలైన్లపై చర్చించినట్లు తుమ్మల తెలిపారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు.. అక్కడి నుంచి పులిచింతల, నాగార్జునసాగర్‌కు గోదావరి జలాలు తరలించటం భవిష్యత్తులో చాలా కీలకమని, పట్టిసీమ-పులిచింతల లింకుతో తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు.


సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వేలైన్‌, పెనుబల్లి నుంచి కొండపల్లి రైల్వేలైను పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని చంద్రబాబుకు సూచించినట్లు తుమ్మల తెలిపారు. రైల్వే లైన్‌ నిర్మాణంతో బొగ్గు రవాణా, పుణ్యక్షేత్రాలు సందర్శించే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కొత్తగూడెం నుంచి పెనుబల్లి రైల్వేలైను పూర్తయ్యిందని, ఏపీలో రైల్వేలైనుపై దృష్టిపెట్టాలని సూచించారు. భద్రాచలంలో ఐదు గ్రామాల విలీనం ఆవశ్యకతను చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు.

Updated Date - Jul 08 , 2024 | 05:13 AM