Motkupalli Narasimhu: ఆ ఇద్దరూ రేవంత్ కాలి గోటికి కూడా సరిపోరు
ABN , Publish Date - Jan 30 , 2024 | 09:39 PM
బీఆర్ఎస్(BRS) నేతలు కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరని మోత్కుపల్లి నర్సింహులు( Motkupalli Narasimhu) ఆరోపించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్(BRS) నేతలు కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరని మోత్కుపల్లి నర్సింహులు( Motkupalli Narasimhu) ఆరోపించారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ నియంత పాలన అంతమొందించిన కాంగ్రెస్‌కు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ను కొట్టడం కోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారని.. రేవంత్ చాలా ఈజీగా కేసీఆర్‌ను దించేశాడన్నారు. కేసీఆర్ సిగ్గు శరం వదిలి ప్రజలని దోచుకున్నారని విమర్శించారు.కేసీఆర్ బయటకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేటీఆర్ చిన్న పిలగాడి లాగా ఆడుకుంటున్నాడన్నారు. కేటీఆర్ ప్రభుత్వాన్ని సొంత ఆస్తి లాగా వాడుకున్నాడని మండిపడ్డారు. త్యాగాలు చేసి అలిసిపోయినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని.. అమరవీరుల రక్తం తాగి వేలాది కొట్లు సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు. ఓడిపోయిన తెల్లారి నుంచే బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి విముక్తి పొందినట్టు.. కేసీఆర్‌కు కూడా వ్యతిరేకంగా పోరాడి విముక్తి పొందారన్నారు. రేవంత్ నాయకత్వాన్ని చూసి ప్రతిపక్ష పార్టీల్లోని ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు.
కేసీఆర్ కుటుంబం ఆ సెంటిమెంట్‌ను వాడుకుంది
బీఆర్ఎస్‌లో చాలా మంది డబ్బుల కోసమే బతుకుతారని ఆక్షేపించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఇక మిగలదని.. లోక్‌సభలో ఆ పార్టీ గెలవదని చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధులో 50% ఎమ్మెల్యేలే తిన్నారని.. వ్యాపారం కోసమే బీఆర్ఎస్ నడిచిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. ప్రజలను కలవని దొంగ కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. 50 రోజుల రేవంత్ పాలన చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారని అన్నారు. ఏ కారణం వల్ల ఓడిపోయారో చెప్పే దమ్ము, దైర్యం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉందా? అని ప్రశ్నించారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను తానే తెచ్చానని కేసీఆర్ డబ్బా కొట్టుకున్నాడని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ ఆస్తులపై విచారణ జరుగుతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ తన ఆస్తులు ఎంతో చెప్పుకొగలరా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫోన్ చేసి... దళిత బంధు పాలసీ గురించి చెబితే మెచ్చుకున్నానని తెలిపారు. తన ఎమ్మెల్యేలే దళితబంధు తింటున్నారని కేసీఆర్ అనలేదా అని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు.