Railway Line: ఒడిశా, ఏపీ, తెలంగాణ.. అనుసంధానం
ABN , Publish Date - Aug 11 , 2024 | 04:11 AM
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన మల్కన్‌గిరి-పాండురంగాపురం రైల్వే లైన్‌తో ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
కొత్త లైన్ పూర్తయితే భద్రాచలం మీదుగా రైలు
ప్రత్యామ్నాయ సరుకు రవాణా కారిడార్‌కు బాటలు
173 కిలోమీటర్లు.. అంచనా వ్యయం రూ.4,109 కోట్లు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు
విశాఖ జోన్‌పై ఏపీ సీఎంతో చర్చిస్తున్నాం: అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన మల్కన్‌గిరి-పాండురంగాపురం రైల్వే లైన్‌తో ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. భద్రాచలం మీదుగా రైళ్లు నడవడమే కాకుండా, ప్రత్యామ్నాయ సరుకు రవాణా కారిడార్‌గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మొత్తం 173.6 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రైల్వే లైన్‌కు రూ.4,109 కోట్ల మేర ఖర్చయ్యే అవకాశం ఉందని వివరించారు. భద్రాచలం మీదుగా రైల్వే లైన్ కలను ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తొలుత ప్రతిపాదించిన మల్కన్‌గిరి-భద్రాచలం రైల్వే లైన్ పొడవు 147.5 కిలోమీటర్లు కాగా, దాన్ని మరో 26.1 కిలోమీటర్లు పెంచి పాండురంగాపురం వరకు పొడిగించామని తెలిపారు. తద్వారా ఈ లైన్‌ను మెయిన్ రైల్ లైన్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. జునాగఢ్(ఒడిశా) - మల్కన్‌గిరి మధ్య చేపట్టిన రైల్వే లైన్ ఇప్పటికే నిర్మాణంలో ఉన్నదని, ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన మల్కన్‌గిరి-పాండురరంగాపురం రైల్వే లైన్ పూర్తయితే ప్రత్యామ్నాయ సరుకు రవాణా కారిడార్‌కు బాటలు పడతాయని తెలిపారు.
ఈ ప్రాజెక్టుతో తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలు పెరుగుతాయని, వ్యవసాయం, వాణిజ్యం, విద్య, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ వంటి అనేక రంగాల్లో వృద్ధి సాధించడానికి దోపదపడుతుందని చెప్పారు. ఒడిశా, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల్లోని అల్యూమినియం, స్టీల్ ఫ్యాక్టరీల ఉత్పత్తులను ఏపీలోని పోర్టులకు తరలించడానికి మార్గం సుగమమవుతుందని తెలిపారు. ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులతోపాటు నూతనంగా నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టు నుంచీ సరకు రవాణాను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని వివరించారు. ఒడిశా నుంచి హైదరాబాద్, విజయవాడకు నేరుగా కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నేషనల్ వాటర్ వే-5తో భవిష్యత్తులో ఈ రైల్వే ప్రాజెక్టును అనుసంధానించి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
బొగ్గు రవాణాకు అనుకూలంగా: వైష్ణవ్
కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలోని రైల్ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసన్‌సోల్ (బెంగాల్)- వరంగల్(తెలంగాణ)ను కలిపేలా సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే జునాగఢ్ - మల్కన్‌గిరి, మల్కన్‌గిరి - పాండురంగాపురం రైల్వే లైన్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి (మొత్తం 290కిలోమీటర్లు) రూ.7,383 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పారు.
తెలంగాణలోని సింగరేణి బొగ్గును ఎగుమతి చేయడానికీ దోహదపడుతుందని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా భద్రాచలం వద్ద గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జి నిర్మిస్తామని వెల్లడించారు. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్లు ఏర్పడినప్పుడు ఇది ప్రత్యామ్నాయ సరుకు రవాణా కారిడార్‌గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాగా, విశాఖ రైల్వే జోన్‌పై సీఎం చంద్రబాబుతో మాట్లాడుతున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నీరు నిలచే అవకాశం ఉన్నందున మరో స్థలం కేటాయింపుపై చర్చిస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తరచూ తమతో మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. హౌరా-చెన్నై కారిడార్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించామని అన్నారు. విజయనగరం వరకు 3వ లైన్ నిర్మాణానికి ఆమోదం తెలపామని, మొత్తంగా 4 లైన్లు నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
సామాజిక, ఆర్థికాభివృద్ధికి దోహదం
ఏపీలోని తూర్పు గోదావరి, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంతోపాటు ఒడిశాలోని పలు జిల్లాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి పాండురంగాపురం- మల్కన్‌గిరి రైల్వే లైన్ దోహదం చేస్తుందని, ఉత్తర, తూర్పు భారతదేశానికి అదనపు రైలు కారిడార్‌గా ఉపయోగపడుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. నూతన రైల్వే లైన్ మంజూరు నేపథ్యంలో రైల్‌నిలయంలో సీనియర్ అధికారులతో కలిసి అరుణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విస్తరణకు ఈ లైన్ తోడ్పడుతుందన్నారు. ఒడిశాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల గుండా సాగే రైల్వే లైన్‌తో బస్తర్ ప్రాంతం నుంచి తెలంగాణ చేరుకోవడానికి 124 కి.మీ దూరం తగ్గుతుందని వివరించారు.