Voters: ఓటేసి వద్దామని!
ABN , Publish Date - May 12 , 2024 | 05:11 AM
భవితకు దారి చూపించే ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనం ఊరి బాట పడుతున్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఓటు వేసి.. ప్రజాస్వామాన్ని బలపరిచేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు.
హైదరాబాద్ నుంచి పయనమైన ఓటరు
ప్రయాణికులతో బస్, రైల్వే స్టేషన్లు కిటకిట
ఏపీ దారులు.. వాహనాలతో బారులు
ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో చార్జీల మోత
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): భవితకు దారి చూపించే ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనం ఊరి బాట పడుతున్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఓటు వేసి.. ప్రజాస్వామాన్ని బలపరిచేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఓట్ల పండుగ కోసం పౌరులు పల్లె బాట పడుతుండటంతో హైదరాబాద్‌లోని బస్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రెండో శనివారం, ఆదివారాలతో పాటు సోమవారం పోలింగ్ సందర్భంగా వరుస సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సికిందరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్ వంటి ప్రధాన బస్ స్టేషన్లలో అడుగు పెట్టలేనంత రద్దీ ఉంది. బస్సు, రైలు రాగానే ప్రయాణికులు కిటికీల గుండా తోసుకుంటూ ఎక్కడం పరిస్థితిని తెలియజేస్తోంది. ఏపీకి వెళ్లే రైళ్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.
పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంది. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు రిజర్వేషన్ కన్‌ఫర్మ్ కాకున్నా వెయిటింగ్ లిస్టు టికెట్లతోనే ప్రయాణిస్తున్నారు. మరికొందరు ప్రయాణానికి ఒక రోజు ముందుగా ఇచ్చే తత్కాల్ టికెట్ల కోసం రిజిర్వేషన్ కౌంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో అటు వైపు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సంక్రాంతి పండుగ సమయంలో ఏపీకి వెళ్లే మార్గాల్లో ఎంతటి రద్దీ ఉంటుందో.. ప్రస్తుతం అలాంటి దృశ్యాలే ఆవిష్కృతమవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే దారులు బస్సులు, ప్రైవేటు వాహనాలతో నిండిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. లక్షలాది మంది ఓటర్లు మహా నగరం నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరడంతో శనివారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. నగరం నుంచి ఏపీకి వెళ్లేందుకు బస్సులు ఆగే మియాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట, లక్డీకాపుల్, ఎల్బీనగర్ తదితర బస్ స్టాపుల్లో ప్రయాణికుల రద్దీ కనిపించింది. కాగా, నగరంలో ఉండే ఏపీ ఓటర్లను పలు పార్టీల వారు దగ్గరుండి తీసుకెళుతున్నారు. బస్సు బయలుదేరే ముందు రూ.2,500 నగదు ఇస్తున్నారు. ఓటు వేశార రూ.2,500 ఇస్తామని, తర్వాత బస్సులో నగరానికి తీసుకొస్తామని చెబుతున్నారు.
బస్సుల్లో చార్జీల బాదుడు..
హైదరాబాద్ నుంచి ఏపీకి డిమాండ్ పెరగడంతో టీఎస్ ఆర్టీసీ 30 నుంచి 50 శాతం వరకు చార్జీలు పెంచేసింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని అధికారులు చెబతున్నారు. మరోవైపు, ప్రైవేట్ బస్సుల్లో ఆర్టీసీ చార్జీలకు రెండింతలు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏసీ బస్సులో రూ.1,300 ఉండగా.. ప్రస్తుతం రూ.2,600 తీసుకుంటున్నారని పలువురు ఓటర్లు చెబుతున్నారు. నాన్ ఏసీ బస్సులో రూ.800 వసూలు చేస్తున్నారని వాపోతున్నారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం ప్రత్యేక రైలు
ఓటు వేసేందుకు వెళ్లే వారి కోసం ఆదివారం సికింద్రాబాద్-విశాఖపట్నం(07097), సోమవారం విశాఖపట్నం-సికిందరాబాద్(07098) ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో సికిందరాబాద్, కాచిగూడ, లింగంపల్లి నుంచి గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లి వచ్చే రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.