Share News

Sircilla: కుల సంఘాల భవనాలతో నాయకులకే లాభం!

ABN , Publish Date - Jul 09 , 2024 | 01:49 AM

కుల సంఘాలకు కార్యాలయాలు నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతుందని, కుల సంఘాల తరఫున కల్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అభిప్రాయపడ్డారు.

Sircilla: కుల సంఘాల భవనాలతో నాయకులకే లాభం!

  • కల్యాణ మండపాలు నిర్మిస్తే అందరికీ ఉపయోగకరం

  • ఆ నిర్మాణాలకే ఎంపీ నిధులిస్తా: కేంద్ర మంత్రి సంజయ్‌

సిరిసిల్ల/హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): కుల సంఘాలకు కార్యాలయాలు నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతుందని, కుల సంఘాల తరఫున కల్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అభిప్రాయపడ్డారు. అలాంటి వాటికే ఎంపీ లాడ్స్‌ నిధులు కేటాయిస్తానని స్పష్టం చేశారు. ఏ కుల సంఘమైనా ఆ కులంలోని పేదలను ఆదుకున్నప్పుడే మనుగడ ఉంటుందన్నారు. మున్నూరు కాపు సంఘం చేపట్టే ప్రజా ఉపయోగ పనులకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వీర్నపల్లి, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి మండలాల్లో ఎంపీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమవారం సంజయ్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారం, సమన్వయంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. ఎన్నికలు అయిపోయినందున ఒకరినొకరు తిట్టుకోవడం బంద్‌ చేద్దామని, విమర్శలు, ఆరోపణలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడదామని ఇతర పార్టీల నాయకులకు సూచించారు.


గురుకులాల పనివేళలు కుదించాలి.. సీఎంకు లేఖ

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలకు సంబంధించి కొత్తగా విడుదల చేసిన టైం టేబుల్‌ అశాస్త్రీయంగా ఉందని, దానిని వెంటనే సవరించాలని బండి సంజయ్‌ సూచించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఉదయం 5 నుండి రాత్రి 9.30 గంటల వరకు పని వేళలు, రాత్రి పూట కేర్‌ టేకర్‌ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు. తక్షణమే వార్డెన్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కాగా, కరీంనగర్‌ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్‌ లీవ్‌ బిల్లులు చెల్లించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. అన్ని జిల్లాలకు బకాయిలు చెల్లించిన ప్రభుత్వం.. కరీంనగర్‌ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 01:49 AM