Ramoji Rao: అక్షర యోధుడి అస్తమయం..
ABN , Publish Date - Jun 09 , 2024 | 03:19 AM
రామోజీరావు మరణం బాధాకరం. భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు. ఆయన సేవలు సినీ, పత్రికా రంగాల్లో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషితో మీడియా, వినోద ప్రపంచాల్లో నూతన ప్రమాణాలను నెలకొల్పారు.
చద్ది వార్తల తెలుగు పాత్రికేయాన్ని
కొత్త పుంతలు తొక్కించిన చీఫ్ ఎడిటర్!
వార్తలనే అందించే టీవీకి 24 గంటల
వినోదాన్ని జోడించిన తెలుగు ఠీవీ!
కమర్షియల్ సినిమాకు
కళాత్మకత అద్దిన మూవీ మొఘల్!
హాలీవుడ్‌లోనే ఉండే ఫిలిం సిటీని
తెలుగు నేలకూ తెచ్చిన ధన్యజీవి..
ఊరికి పరిమితమైన చిట్‌ఫండ్‌ను
కార్పొరేట్ చేసిన మార్గదర్శి!
ఇంటింటా పెట్టుకునే పచ్చళ్లను
పరిశ్రమగా మార్చిన దార్శనికుడు!
తన కంపెనీలతో వేల మందికి
ఉపాధి కల్పిస్తున్న అన్నదాత..
ఆయనే.. అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అనన్య సామాన్యుడిగా ఎదిగిన చెరుకూరి రామోజీ రావు! నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అనే ఆయన ఆ ఉషోదయానికి ముందే పరమపదించారు!
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత
5న తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరికఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస
ముర్ము, మోదీ, రేవంత్, బాబు దిగ్ర్భాంతి ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఎండీ వేమూరి రాధాకృష్ణ సహా నివాళులర్పించిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు
నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఫిలింసిటీలో అంత్యక్రియలు
రామోజీరావు మరణం బాధాకరం. భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు. ఆయన సేవలు సినీ, పత్రికా రంగాల్లో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషితో మీడియా, వినోద ప్రపంచాల్లో నూతన ప్రమాణాలను నెలకొల్పారు. ఆయనతో సంభాషించడం, ఆయన అపారమైన జ్ఞానం నుంచి లబ్థి పొందేందుకు నాకు అనేక అవకాశాలు లభించడం నా అదృష్టం.
- ప్రధాని నరేంద్ర మోదీ
పనిలోనే విశ్రాంతి అంటూ దశాబ్దాలుగా అవిశ్రాంత పయనం సాగించిన ఆ మహా మనిషి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు..! వేలాది జీవితాల్లో వెలుగుగా మారి.. కోట్లాదిమందిని కదిలించిన చైతన్యమూర్తి ఇక సెలవంటూ వీడ్కోలు పలికారు..! సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. దీక్షాదక్షతతో ముందుకుసాగి.. గొప్ప శక్తిగా మారి.. మహా వ్యవస్థగా ఎదిగిన ధీశాలి, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) అస్తమించారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నెల 5న తీవ్రమైన గుండె పోటు రావడంతో రామోజీరావును ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే గుండె పనితీరు విఫలం కావడంతో పాటు రక్తపోటు పడిపోయింది. దీంతో వెంటిలేటర్‌పై ఉంచి ఇంట్రా అరోటిక్ బెలూన్ పంప్ (ఐఏబీపీ) మద్దతుతో చికిత్స అందించారు. అత్యవసర యాంజియోగ్రామ్ చేయడంతో పాటుగా స్టెంట్ వేశారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో శనివారం తెల్లవారుజామున 4.51 గంటలకు రామోజీరావు తుది శ్వాస విడిచారని స్టార్ హాస్పిటల్ ప్రకటించింది. కాగా, అనంతరం రామోజీరావు పార్థివదేహాన్ని ఫిలింసిటీకి తరలించారు. ఆదివారం ఉదయం 9-10 గంటల మధ్యలో ఫిలింసిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడినుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఈ మేరకు ఆదేశించారు. ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌లకు సీఎస్ సూచించారు. రామోజీరావు మరణవార్త తెలిసిన వెంటనే ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ సంస్ధల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఫిలింసిటీకి వెళ్లి నివాళులర్పించారు. రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా, అజరామర చిత్రాలను నిర్మించడంతో పాటు సినీ రంగానికి ఫిలింసిటీ లాంటి అద్భుతాన్ని అందించిన రామోజీరావుకు నివాళిగా ఆదివారం షూటింగ్‌లను నిలిపివేయాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయించింది.
ఫిలింసిటీలో ఘనంగా నివాళులు..
రామోజీరావును కడసారి చూసేందుకు ఫిలింసిటీలోని ఆయన నివాసానికి రాజకీయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయన భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. కాగా, రామోజీరావు మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆది, సోమవారాలు సెలవు దినంగా ప్రకటించారు. ఆయన అంత్యక్రియలకు సీనియర్ ఐఏఎ్‌సలు ఆర్పీ సిసోదియా, రజత్ భార్గవ, సాయిప్రసాద్‌లతో కూడిన బృందాన్ని ప్రత్యేకంగా పంపుతున్నట్లు వెల్లడించింది. ప్రధాని మోదీ సందేశంతో వచ్చిన కేంద్ర మాజీ మంత్రి నిర్మలాసీతారామన్.. రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కాగా, రామోజీకి నివాళులర్పించినవారిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి, పలువురు మంత్రులతో పాటు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు పూర్వ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ ఉన్నారు.
జననం
1936 నవంబరు 16
పుట్టిన గ్రామం
కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి
తల్లిదండ్రులు
వెంకటసుబ్బారావు, వెంకట సుబ్మమ్మ
వివాహం
1961 ఆగస్టు 19న రమాదేవితో
రామయ్య.. రామోజీరావుగా
రామోజీరావు అసలు పేరు రామయ్య. అయితే ఆయన పాఠశాలలో చేరాక.. తొలి రోజు ఉపాధ్యాయుడు నీ పేరేంటి అని అడగ్గా.. ఈయన రామోజీరావు అని చెప్పారు. రికార్డులో అదే పేరు ఎక్కింది. అలా తన పేరును తానే మార్చి పెట్టుకున్నారు. ఆయన భార్య పేరు చిన్నతనంలో రమణమ్మ. ఆమె కూడా రామోజీరావు లాగానే ఆమె పేరును రమాదేవిగా మార్చుకున్నారు. ఆమె పేరిటే రమాదేవి పబ్లిక్ స్కూల్‌ను రామోజీరావు స్థాపించారు.