Share News

Ramoji Rao: అశ్రునయనాలతో..

ABN , Publish Date - Jun 10 , 2024 | 04:23 AM

బంధుమిత్రుల అశ్రునయనాలు.. ప్రముఖులు, సన్నిహితుల నివాళుల నడుమ.. రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి.

Ramoji Rao: అశ్రునయనాలతో..

  • రామోజీరావు అంత్యక్రియలు పూర్తి

  • ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు

  • అధికారిక లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వం

  • రామోజీ పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు

  • అంతిమయాత్రలో రాజకీయ, సినీ ప్రముఖులు

  • కన్నీటితో వీడ్కోలు పలికిన కుటుంబసభ్యులు

హైదరాబాద్‌ సిటీ, అబ్దుల్లాపూర్‌మెట్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): బంధుమిత్రుల అశ్రునయనాలు.. ప్రముఖులు, సన్నిహితుల నివాళుల నడుమ.. రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిలింసిటీలోని విశాలమైన ప్రాంతంలో రామోజీరావు నిర్మాణం చేయించుకున్న స్మృతివనంలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పోలీసులు గౌరవ సూచకంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. రామోజీరావు చితికి పెద్ద కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్‌ నిప్పంటించారు. రామోజీరావు పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం ఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్‌ కార్యాలయం నుంచి ఇంటికి తరలించారు. లాంఛనాల అనంతరం ఉదయం 9.30కు పోలీసుల గౌరవవందనంతో అంతిమయాత్ర ప్రారంభమైంది. వేలాదిమంది వెంట రాగా రామోజీ గ్రూప్‌ సంస్థల కార్యాలయాల మీదుగా 10.30 గంటలకు స్మృతివనం వద్దకు చేరుకుంది. ప్రధాన గేటు వద్ద వాహనం నుంచి రామోజీరావు పాడెను కిందకు దించగా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు.

13.jpg


స్మతివనం లోపలి వరకు పాడెను మోసారు. ఓ దశలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, వారి కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రహ్మణి అక్కడే ఉన్నారు. కాగా, రామోజీ సంస్థల సిబ్బంది, అభిమానుల జోహార్‌ రామోజీరావు నినాదాల మధ్యన 11.30కు అంత్యక్రియలు ముగిశాయి. స్మృతివనం వద్ద రామోజీరావు కడచూపు సందర్భంగా భార్య రమాదేవి, పెద్ద కుమారుడు కిరణ్‌, కోడళ్లు శైలజాకిరణ్‌, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి సొహాన, మనవడు సుజయ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమయాత్ర వాహనంలో రామోజీరావు కుటుంబసభ్యులతో పాటు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ఎమ్మెల్యే సుజనాచౌదరి ఉన్నారు. రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు రజత్‌భార్గవ, సిసోడియా, సాయిప్రసాద్‌లు శ్రద్ధాంజలి ఘటించారు. పలు రాష్ట్రాల నుంచి రామోజీ అభిమానులు, ప్రముఖులు కూడా హాజరయ్యారు.


తరలివచ్చిన ప్రముఖులు, ప్రజలు

రామోజీరావుకు నివాళి అర్పించేందుకు రెండో రోజూ సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్‌సిటీ సమీప గ్రామాల ప్రజలు స్మృతి వనంకు చేరుకున్నారు. అంతిమ సంస్కారాలను వీక్షించేందుకు ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. రామోజీరావు అంతిమ యాత్రలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, నారా లోకేష్‌ పాల్గొన్నారు. తెలంగాణ మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, బీఆర్‌ఎస్‌ ఎంపీలు కేఆర్‌ సురే్‌షరెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్‌, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు, మాజీ మంత్రులు మండవ వెంకటేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు నివాళులర్పించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఏపీ ఎమ్మెల్యేలు రఘురామరాజు, ప్రత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్‌, వెనిగండ్ల రాము, అరిమిల్లి రాధాకృష్ణ, టీడీపీ సీనియర్‌ నేతలు కొమ్మారెడ్డి పట్టాభి, దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. మాజీ ఎంపీలు గిరీష్‌ సంఘీ, నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, జయప్రకాష్‌ నారాయణ్‌, రాజకీయ నేతలు దేవేందర్‌గౌడ్‌, మర్రి శశిధర్‌రెడ్డి, వి.హనుమంతరావు, కనుమూరి బాపిరాజు, తీగల కృష్ణారెడ్డి, సినీ ప్రముఖులు మురళీమోహన్‌, సురే్‌షబాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, బోయపాటి శ్రీను, బండ్ల గణేష్‌, వేణు, శ్యాంప్రసాద్‌రెడ్డి, రవిబాబు తదితరులు రామోజీరావుకు నివాళులర్పించారు.


రామోజీ సూచనలు

జీవితాంతం పాటిస్తా: లోకేశ్‌

15.jpg

సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, ప్రభుత్వాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్‌ కొనియాడారు. రామోజీరావు సూచనలను తాను జీవితాంతం పాటిస్తానని తెలిపారు.


దార్శనికుడిని కోల్పోయాం.. : కమల్‌హాసన్‌

రామోజీరావు మృతితో ఓ దార్శనికుడిని, సరికొత్తగా ఆలోచించే వ్యక్తిని కోల్పోయామని ప్రముఖ హీరో కమల్‌ హాసన్‌ అన్నారు. భారతీయ మీడియా, సినీ రంగాలకు విశేష సేవలందించిన రామోజీ.. ఫిలింసిటీ వంటి గొప్ప కళాఖండాన్ని అందించారని పేర్కొన్నారు. రామోజీ మృతి భారతీయ సినిమాకు తీరని లోటు అని ట్వీట్‌ చేశారు. రామోజీరావు దూరదృష్టి ఉన్న స్ఫూర్తిదాయక సారథి అని.. మలయాళ నటుడు మోహన్‌లాల్‌ కొనియాడారు. ఆయన స్థాపించిన ఫిలింసిటీ సినీ నిర్మాణంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని వివరించారు.


అక్షర యోధుడికి వీడ్కోలు పలికా: చంద్రబాబు

‘‘తెలుగు వెలుగు, అక్షర యోధుడి అంతిమసంస్కార కార్యక్రమాల్లో పాల్గొని.. తెలుగు వారి ఆత్మబంధువు రామోజీరావుకు కడసారి వీడ్కోలు పలికా’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్‌ చేశారు. తన హృదయం బాధతో నిండిపోయిందని, రామోజీరావు మన మధ్య లేకపోయినా, ఆయన పంచిన స్ఫూర్తి మార్గదర్శిగా మనల్ని ముందుకు నడిపిస్తుందని పేర్కొన్నారు. ఉషా కిరణాల్లాంటి ఆయన కీర్తి అజరామరమై వెలుగుతుందని అన్నారు.


రామోజీరావు మృతి తీరని లోటు

11.jpg

గుంటూరు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి కీర్తిని విరజిమ్మిన ఆదర్శ మూర్తి రామోజీరావు అని కాకతీయ సేవాసమితి డల్లాస్‌ నిర్వాహకులు కొనియాడారు. రామోజీరావు సంస్మరణ సభను డల్లాస్‌లోని ఫ్రిస్కోలో కాకతీయ ేసవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ రామోజీరావు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి పట్టుదలతో అనేక సంస్థలను స్థాపించి ఎందరికో ఉపాధి కల్పించి సమాజేసవ చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

Updated Date - Jun 10 , 2024 | 04:23 AM