Share News

BRS: బీఆర్‌ఎస్‌ నిర్వాకంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ఆగింది..

ABN , Publish Date - May 18 , 2024 | 04:32 AM

రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) విషయంలో యుటిలిటీ చార్జీలను చెల్లించబోమని గత బీఆర్‌ఎస్‌ సర్కారు కేంద్రానికి లేఖ రాయడంతో మొత్తం ప్రాజెక్టే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యుటిలిటీ చార్జీల కింద రూ.363.43 కోట్లను చెల్లిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి, తాను కలిసి లేఖ రాశామని వెల్లడించారు.

BRS: బీఆర్‌ఎస్‌ నిర్వాకంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ఆగింది..

  • సీఎం, నేను కలిసి కేంద్రంతో చర్చలు జరిపి యుటిలిటీ చార్జీలు చెల్లిస్తామని లేఖ రాశాం

  • హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై 17 బ్లాక్‌స్పాట్ల వద్ద ప్రత్యామ్నాయ చర్యలు

  • సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) విషయంలో యుటిలిటీ చార్జీలను చెల్లించబోమని గత బీఆర్‌ఎస్‌ సర్కారు కేంద్రానికి లేఖ రాయడంతో మొత్తం ప్రాజెక్టే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యుటిలిటీ చార్జీల కింద రూ.363.43 కోట్లను చెల్లిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి, తాను కలిసి లేఖ రాశామని వెల్లడించారు. ఈ క్రమంలోనే తాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడంతో యుటిలిటీ చార్జీలను భరించేందుకు కేంద్రమే ముందుకు వచ్చిందని తెలిపారు. 2021లోనే ఆర్‌ఆర్‌ఆర్‌ను కేంద్రం మంజూరు చేయగా, ఇప్పటికీ నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు. ఫలితంగా రాష్ట్రం కూడా అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో కలిసి పలు అంశాలపై మంత్రి సమీక్షించారు.


ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంలో 70 శాతం భూ సేకరణ పూర్తయిందని, మిగతా 30శాతం పురోగతిలో ఉందని అధికారులు వివరించారు. నర్సాపూర్‌ పరిధిలో అటవీ శాఖకు సంబంధించిన అంశంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ కోర్టు కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు స్పందించిన మంత్రి.. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో అలసత్వం లేకుండా పనిచేయాలని, భూసేకరణ సహా ఇతర పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే, హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌-65)పై గుర్తించిన 17 బ్లాక్‌స్పాట్స్‌ (ప్రమాదాలు జరుగుతు న్న ప్రాంతాలు) వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ప్రమాదాలను అరికట్టాలని సూచించారు. బ్లాక్‌స్పాట్‌ ప్రాంతాల వద్ద పనులు చేపట్టే విషయంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే.. స్పెషల్‌ సెక్రటరీతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పనులను పూర్తి చేయాలన్నారు. కాగా, రాష్ట్రంలో కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్‌ అండ్‌ బీ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వానలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయడంతోపాటు ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - May 18 , 2024 | 04:34 AM