Dharani Portal: ధరణి పేరు భూమాతగా మార్పు?
ABN , Publish Date - Aug 01 , 2024 | 03:35 AM
ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఒక జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఒకదానికి పీవీ పేరు?
నేడు క్యాబినెట్ భేటీ.. జాబ్ క్యాలెండర్‌పై చర్చ
హైదరాబాద్, జూలై 31(ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఒక జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు శాసనసభ కమిటీ హాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్న రాష్ట్ర మంత్రి వర్గం ఈ అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ధరణి పేరును భూమాతగా మార్చనున్నట్లు కాంగ్రెస్ పార్టీ.. తన ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టింది.
అధికారంలోకి వచ్చాక సమస్యలపై అధ్యయనం కోసం కమిటీనీ ఏర్పాటు చేసింది. క్యాబినెట్ భేటీలో ఈ అంశాలన్నింటిపైనా చర్చించనున్నట్లు చెబుతున్నారు. రైతు, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ కమిషన్లకు చట్టబద్ధత కల్పించి.. చైర్మన్లకు క్యాబినెట్ హోదా ఇవ్వాలనుకున్నారు. సాంకేతిక కారణాలతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే ఈ కమిషన్లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ కమిషన్ల ఏర్పాటు పైనా క్యాబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు.. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్‌లకు ఇళ్ల స్థలాలు, గ్రూప్-1 క్యాడర్‌లో ఉద్యోగాల కల్పనపైనా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్‌పైనా క్యాబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థలకు ఎన్నికలు, ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.