Share News

T. Jaggareddy: కాంగ్రెస్‌ ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. మోదీ సర్కార్‌ రద్దు చేసింది

ABN , Publish Date - Jun 22 , 2024 | 03:42 AM

రద్దయిన ఐటీఐఆర్‌ను తిరిగి తెప్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపైనే ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. ఆ తర్వాత వచ్చిన మోదీ సర్కారు దాన్ని రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు.

T. Jaggareddy: కాంగ్రెస్‌ ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. మోదీ సర్కార్‌ రద్దు చేసింది

  • తిరిగి తెప్పించాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, సంజయ్‌లదే

  • జనాన్ని రెచ్చగొట్టడం కాదు.. ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టండి

  • కాంగ్రె్‌సలో నేతల చేరిక అంశం సీఎం పరిధిలోనిది: తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రద్దయిన ఐటీఐఆర్‌ను తిరిగి తెప్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపైనే ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. ఆ తర్వాత వచ్చిన మోదీ సర్కారు దాన్ని రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఐటీఐఆర్‌ రద్దుతో రాష్ట్రంలోని దాదాపు 15 లక్షల కుటుంబాలు ఉద్యోగాలకు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐటీఐఆర్‌ను మంజూరు చేసిందన్నారు. లక్షలాది కుటుంబాలకు ఉద్యోగాలు, ఉపాధిని అందించే ఐటీఐఆర్‌ను మోదీ సర్కార్‌ రద్దు చేస్తుంటే.. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు అడ్డుకోలేకపోయారని విమర్శించారు.


‘‘మోదీ సర్కారు ఐటీఐర్‌ను రద్దు చేస్తే.. దానిపైన చర్చే లేదు. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు తప్ప ఉద్యోగాలపైన చర్చ లేదు. యువత కూడా.. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదనే దానిపైన కాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలకే ఆకర్షితులవుతున్నరు. జెండాలు పట్టుకుని జై శ్రీరాం అంటారే గానీ.. బతకడానికి అక్కరకు వచ్చే ఐటీఐఆర్‌ గురించి మాత్రం పట్టించుకోరు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు గుడులకు వెళ్లి దీపం పెట్టరు కానీ.. గుళ్లూ, గోపురాల చుట్టే రాజకీయం తిప్పుతున్నారని విమర్శించారు. బండి సంజయ్‌.. కేంద్ర మంత్రిగా హైదరాబాద్‌ గడ్డపైన అడుగు పెట్టగానే నగరానికి ఐటీఐఆర్‌ను తీసుకొస్తానని అనుంటే బాగుండేదన్నారు. కానీ ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని బంగారు ఆలయం చేస్తానని మాట్లాడారన్నారు. ‘‘ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టు.. సెంటిమెంట్‌తో వారిని రెచ్చగొట్టడం మానుకుని ఉద్యోగాల కల్పనపైన దృష్టి పెట్టు’’ అని బండి సంజయ్‌కి సూచించారు.


తక్షణమే హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేయించాలంటూ కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను డిమాండ్‌ చేశారు. కాగా.. కాంగ్రె్‌సలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరిక అంశం ముఖ్యమంత్రి పరిధిలోనిదన్నారు. శాసనసభ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోబోనని చెప్పారు. రాజకీయ వ్యవహారాల్లో తాను ఓ పరిధిని విధించుకున్నానని తెలిపారు. కాంగ్రె్‌సలో పోచారం చేరికపైన అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన స్పందించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తనతో చెప్పాలంటూ 14 నెలల కిందట రాహుల్‌గాంధీ చెప్పారని, ఆయన మాటను తాను జవదాటబోనన్నారు. తనలో ఎన్ని ఆలోచనలు ఉన్నా మౌనంగానే ఉంటానని చెప్పారు. కాగా.. తెలుగు ప్రజలు గుర్తించే అన్ని ప్రాంతాలతో తనకు సంబంధం ఉంటుందని జగ్గారెడ్డి అన్నారు. తెలుగు ప్రజలకు అనుకూలమైన రాజకీయ ప్రకటనలు చేసిన సందర్భాలూ ఉన్నాయన్నారు.

Updated Date - Jun 22 , 2024 | 03:42 AM