Share News

Sitarama Project: ఐదేళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు

ABN , Publish Date - Aug 12 , 2024 | 04:00 AM

వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 30-35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరవ్వడమే లక్ష్యమని భారీ నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తెస్తున్నట్లు చెప్పారు.

Sitarama Project: ఐదేళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు

  • ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతలే లక్ష్యం

  • ‘సీతారామ’తో ఖమ్మం సస్యశ్యామలం

  • 15న సీఎం రేవంత్‌ చేత ప్రాజెక్టు ప్రారంభం

  • సీతారామ ట్రయల్‌ రన్‌ ప్రారంభంలో ఉత్తమ్‌

కొత్తగూడెం, ఖమ్మం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/వైరా, దేవరకొండ, డిండి, దామరచర్ల, ఆగస్టు 11: వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 30-35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరవ్వడమే లక్ష్యమని భారీ నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తెస్తున్నట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల బిల్లులను వెంటనే మంజూరు చేస్తామన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 6.30 లక్షల ఎకరాలకు గోదావరి నీరందించి ఉమ్మడి ఖమ్మంను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా డిండి సాంఘిక సంక్షేమ గురుకులంలో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రాజెక్టులపై సమీక్ష అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం గ్రామాల్లో సీతారామ పంప్‌హౌస్‌ ట్రయల్‌ రన్‌ను ఉత్తమ్‌ ప్రారంభించారు.


మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతారామ ట్రయల్‌ రన్‌ విజయవంతమైందని ఉత్తమ్‌ ప్రకటించారు. ఈ ఆగస్టు 15తో గోదావరి జలాల వినియోగం మొదలవుతుందన్నారు. 2026 ఆగస్టు 15 నాటికి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని, ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్‌ జిల్లాలో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. కాగా, సీతారామ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను పొంగులేటితో కలిసి ఉత్తమ్‌ పరిశీలించారు.


15న భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద ఒక పంపుహౌజ్‌ను సీఎం, మరో పంపుహౌజ్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి, ఇంకోదానిని జిల్లా ఇంచార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. సీతారామకు నెలాఖరులోగా పూర్తిస్థాయిలో అనుమతులు రాబోతున్నాయని ప్రకటించారు. సాగర్‌లో నీరు లేకపోయినా గోదావరి జలాలతో సాగర్‌ ఆయకట్టుకు నీరిస్తామని చెప్పారు. వైరా సభలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. తుమ్మల మాట్లాడుతూ 2017లో ప్రారంభమైన సీతారామ పనులు మధ్యలో నత్తనడకన సాగాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక వేగం పెంచామని చెప్పారు. పొంగులేటి మాట్లాడుతూ సీతారామకు రూ.2,400 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేదని, కానీ డిజైన్‌ మార్చి గత ప్రభుత్వం రూ.18 వేల కోటు ఖర్చుచేసిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక ఈ ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యం కల్పించామన్నారు.


  • ఎంత ఖర్చయినా ఎస్‌ఎల్‌బీసీ, డిండి పూర్తి

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం, డిండి ఎత్తిపోతల తన మనసుకు దగ్గరగా ఉన్నాయని, ఎంత ఖర్చయినా సరే వీటిని పూర్తిచేస్తానని, మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. సొరంగ మార్గం పనులకు అంచనాలు సవరించి రూ.460 కోట్ల మంజూరుకు క్యాబినెట్‌ ముందుకుతీసుకెళ్తామని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఐదు ఎత్తిపోతలకు తక్షణమే రూ.490 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - Aug 12 , 2024 | 04:00 AM