Hyderabad: 2 కమిటీలు..
ABN , Publish Date - Jul 07 , 2024 | 03:40 AM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా రెండు రాష్ట్రాలు ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు వేశాయి. ఈ సమస్యల పరిష్కారానికిగాను రెండు రాష్ట్రాలు కలిసి రెండు కమిటీలను నియమించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది.
విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశంలో నిర్ణయం
తొలుత సీఎస్‌లతో అధికారుల కమిటీ.. 2 వారాల్లో భేటీ
ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ నియామకం
అధికారుల కమిటీలో తేలకపోతే మంత్రుల కమిటీ దృష్టికి
అక్కడ పరిష్కరించిన సమస్యలకు సీఎంల ఆమోదం
డ్రగ్స్ నిరోధానికి అదనపు డీజీలతో కో-ఆర్డినేషన్ కమిటీ
సీఎంలు రేవంత్, చంద్రబాబు సమావేశంలో నిర్ణయాలు
డిప్యూటీ సీఎం భట్టి, ఏపీ మంత్రి సత్యప్రసాద్ వెల్లడి
గంటా 45 నిమిషాలపాటు కొనసాగిన సీఎంల భేటీ
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా రెండు రాష్ట్రాలు ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు వేశాయి. ఈ సమస్యల పరిష్కారానికిగాను రెండు రాష్ట్రాలు కలిసి రెండు కమిటీలను నియమించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. రెండు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీని వేయనున్నారు. ముందుగా చీఫ్ సెక్రటరీలతో ఉన్నతస్థాయి అధికారుల కమిటీని నియమిస్తారు. ఇందులో ఒక్కో రాష్ట్రం నుంచి చీఫ్ సెక్రటరీతో కలిపి ముగ్గురేసి అధికారులు ఉంటారు. తమ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుంది. అప్పటికీ సమస్యలకు పరిష్కారం లభించకపోతే.. ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీని నియమించాలని సీఎంలు నిర్ణయించారు. ఈ మంత్రుల కమిటీ పరిష్కరించిన సమస్యలకు ముఖ్యమంత్రుల స్థాయిలో ఆమోదం తెలపాలన్న నిర్ణయానికి వచ్చారు.
అపరిష్కృతంగా ఉన్న ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014’లోని విభజన అంశాలపై శనివారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇక్కడి ప్రజాభవన్‌లో సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 7.45 గంటల వరకు గంటా 45 నిమిషాలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు(ప్రొటోకాల్) హర్కర వేణుగోపాలరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతోపాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రజాభవన్‌కు ముందుగా రేవంత్‌రెడ్డి చేరుకోగా.. ఆ వెంటనే చంద్రబాబు వచ్చారు. చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించారు. తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని చంద్రబాబుకు బహూకరించారు. కాగా, రేవంత్, భట్టివిక్రమార్కలకు చంద్రబాబు వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్.. మీడియాకు వివరాలు వెల్లడించారు.
త్వరితగతిన చర్చించుకుని ముందుకు..
‘‘రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేను, ఏపీ మంత్రులు అందరం కలిసి విభజన అంశాలపై లోతుగా చర్చించాం. విభజనకు సంబంధించిన చాలా సమస్యలు గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదు. వీటన్నింటిపై త్వరితగతిన చర్చించుకుని, ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలతోపాటు పరిష్కారానికి నోచుకోని ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ సమస్యలన్నింటికీ సమాధానాలు, పరిష్కారాలు సమావేశంలోనే దొరుకుతాయని అనుకోలేదు. వీటి పరిష్కారానికిగాను విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సమావేశంలో కూలంకషంగా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చాం’’ అని భట్టివిక్రమార్క చెప్పారు. ఈ మేరకు విభజన సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కూడిన కమిటీని వేయాలని నిర్ణయించామన్నారు.
చీఫ్ సెక్రటరీలతో సహా ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు అధికారులతో ఈ కమిటీని నియమిస్తామన్నారు. ‘‘ రెండు వారాల్లోగా ఈ కమిటీ సమావేశమై, వారి స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలపై చర్చిస్తుంది. ఒకవేళ ఈ ఉన్నతాధికారుల కమిటీ స్థాయిలో కూడా పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉంటే... వాటి పరిష్కారానికి రెండు రాష్ట్రాల మంత్రులతో కూడిన మరో కమిటీని వేయాలని నిర్ణయించాం. ఈ మంత్రుల కమిటీ కూడా సమావేశాలు నిర్వహించి, వారి స్థాయిలో సమస్యలను చర్చిస్తుంది. ఈ మంత్రుల కమిటీ చర్చించి పరిష్కరించే అంశాలను ముఖ్యమంత్రుల స్థాయిలో ఆమోదించడం జరుగుతుంది. అప్పటికీ పరిష్కారం కాకపోతే.. ముఖ్యమంత్రుల స్థాయిలో మళ్లీ సమావేశాలు నిర్వహించుకుని పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం’’ అని భట్టివిక్రమార్క వివరించారు.
ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా పరిష్కారం: అనగాని
ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా విభజన అంశాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘‘ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన ఈ రోజు తెలుగు జాతి హర్షించే మంచి రోజు. ఇప్పటికే తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని ఇక్కడి సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సహచర మంత్రులు పని చేస్తున్నారు. అయితే తెలుగువారు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలని భావించి మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి సమావేశమవుదామంటూ రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఆ మేరకు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై కూలకంషంగా చర్చించి, మంత్రులు, అధికారుల అభిప్రాయాలను తీసుకున్నాం. ఇదివరకు నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగింది. ఆంధ్రప్రదేశ్ మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదని, అందరి భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని, సమస్యలను సానుకూలంగా, సత్వరంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాం.
అందులో భాగంగానే అధికారులు, మంత్రుల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. విభజన సమస్యలే కాకుండా.. రాబోయే రోజుల్లో మంచి వాతావరణాన్ని సృష్టించడానికి తరచుగా ముఖ్యమంత్రులు కలవాలని నిర్ణయించారు. తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలన్న తపనతో పని చేస్తున్నారు. అక్కడ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ నియంత్రణకు ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ వేశాం. అక్కడ స్కూల్ బ్యాగుల్లో గంజాయి దొరుకుతున్న పరిస్థితులున్నాయి. అక్కడున్న డ్రగ్ కల్చర్‌కు, ఇక్కడి డ్రగ్స్ కల్చర్‌కు లింకు ఉంది. ఎందుకంటే అక్కడ గంజాయి ఉత్పత్తి అయి ఇక్కడి వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళనతో ఉన్నారు. అందుకే ఇరు రాష్ట్రాల అదనపు డీజీ స్థాయి అధికారులతో ఓ కమిటీని వేశాం. రెండు వారాల్లో, ఇరు ముఖ్యమంత్రులు హర్షించేవిధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. తెలుగు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ హర్షించే విధంగా ఈ విభజన సమస్యలన్నింటీని పరిష్కరిస్తాం’’ అని సత్యప్రసాద్ వివరించారు. కాగా, పలు అంశాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అన్నింటినీ చర్చించడానికే కమిటీలు వేస్తున్నామంటూ భట్టివిక్రమార్క ఒకే వాక్యంలో సమాధానమిచ్చారు.
డ్రగ్స్ నిరోధానికి కో-ఆర్డినేషన్ కమిటీ
సమావేశంలో మరో అతి ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకు ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి, ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నాం. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి కార్యాచరణతో ముందుకు వెళుతున్నాం. దాంతోపాటు సైబర్ క్రైమ్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ముందుకు వెళుతున్నాం. వీటిపై రెండు రాష్ట్రాలు ఒక కో-ఆర్డినేసన్ కమిటీ ద్వారా పని చేస్తే నియంత్రించడానికి అవకాశముంటుందని భావించాం. వివిధ సరిహద్దుల నుంచి రకరకాల డ్రగ్స్ వస్తున్నాయి. అందుకే వీటి నియంత్రణ కోసం ఇరు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయి అధికారులతో ఒక కో-ఆర్డినేషన్ కమిటీని వేయాలని నిర్ణయించాం. ఈ మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలను కాపాడాలని విధానపరమై నిర్ణయం తీసుకున్నాం’’ అని భట్టి వివరించారు.