Share News

Mahabuubnagar: త్వరలో స్వదేశానికి సూఫియాన్‌!

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:28 AM

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇరుక్కుపోయిన తెలంగాణకు చెందిన సూఫియాన్‌ త్వరలోనే స్వదేశానికి వస్తాడని అతని కుటుంబసభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Mahabuubnagar: త్వరలో స్వదేశానికి సూఫియాన్‌!

  • రష్యా సైన్యంలో పని చేస్తున్న తెలంగాణ వాసి

మహబూబ్‌నగర్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇరుక్కుపోయిన తెలంగాణకు చెందిన సూఫియాన్‌ త్వరలోనే స్వదేశానికి వస్తాడని అతని కుటుంబసభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా సైన్యంలో ఉన్న భారతీయులను స్వదేశానికి పంపాలని భారత్‌ ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సానుకూలంగా స్పందించారనే వార్తల నేపథ్యంలో సూఫియాన్‌ కుటుంబసభ్యులు నమ్మకంగా ఉన్నారు. తెలంగాణలోని నారాయణపేటకు చెందిన సూఫియాన్‌ పొట్టకూటి కోసం 2021లో దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ ఓ దళారి మాటలు నమ్మి 2023 నవంబరులో రష్యా వెళ్లి ప్రస్తుతం యుద్ధభూమిలో పని చేస్తున్నాడు.


సూఫియాన్‌ మాదిరిగానే చాలా మంది రష్యా సైన్యంలో పని చేస్తున్నారు. ఇటీవల రష్యా వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడి సైన్యంలో ఉన్న భారతీయులందరినీ స్వదేశానికి పంపాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు. అయితే, సూఫియాన్‌ ప్రస్తుతం యుద్ధభూమికి 70-80 కిలోమీటర్ల దూరంలో పని చేస్తున్నాడని అతని సోదరుడు సల్మాన్‌ ‘అంధ్రజ్యోతి’కి తెలిపాడు. ప్రధాని మోదీ చొరవ వల్ల సూఫియాన్‌ త్వరలోనే స్వదేశానికి రానున్నాడని తమకు సమాచారం ఉందని చెప్పారు. రాయబార కార్యాలయం నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

Updated Date - Jul 15 , 2024 | 04:28 AM