Share News

Jaggareddy: సోనియా, రాహుల్‌ డైరెక్షన్‌లో.. రుణమాఫీ మొదలెట్టిన రేవంత్‌, మంత్రివర్గం

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:16 AM

గురువారం సాయంత్రం 4 గంటల నుంచి.. సోనియా, రాహుల్‌ డైరెక్షన్‌లో.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం.. రూ. 2 లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి చెప్పారు.

Jaggareddy: సోనియా, రాహుల్‌ డైరెక్షన్‌లో.. రుణమాఫీ మొదలెట్టిన రేవంత్‌, మంత్రివర్గం

  • రుణమాఫీతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ వాళ్లకు నిద్రపట్టట్లేదు

  • రైతుల పేరిట సినిమాలు తీసిన చిరంజీవి ఢిల్లీ నిరసనకు మద్దతెందుకు తెలపలేదు?

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): గురువారం సాయంత్రం 4 గంటల నుంచి.. సోనియా, రాహుల్‌ డైరెక్షన్‌లో.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం.. రూ. 2 లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి చెప్పారు. పదేళ్ల అధికారంలో రూ.7 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసిన కేసీఆర్‌, హరీశ్‌రావులు.. రైతు రుణమాఫీ పథకానికి ఖర్చు చేసింది కేవలం రూ.26 వేల కోట్లు మాత్రమేనన్నారు. కానీ.. సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రకారం.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.31 వేల కోట్ల మేరకు రైతు రుణమాఫీని మొదలు పెట్టిందని పేర్కొన్నారు.


ఈ పథకం అమలుకు ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉన్నా.. ఆరు నెలల్లోనే పూర్తి చేస్తుందన్నారు. పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. రైతులకు ఎన్ని వేలకోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసిందో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు చెప్పగలరా అంటూ నిలదీశారు. గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ పథకాన్ని ప్రారంభించగానే రైతుల ఇళ్లలో సంబరాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. రుణమాఫీ పథకం అమలుతో రాష్ట్రంలోని బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర పట్టడం లేదని, కొందరు నేతలైతే నిద్రమాత్రలు వేసుకుని పడుకున్నారని ఎద్దేవా చేశారు. గడిచిన పదేళ్లలో నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా వంటి పది మంది పెద్ద మనుషులకు మోదీ ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్ల మేరకు రుణాలను మాఫీ చేసిందని, అందులో ఎవరైనా రైతులు ఉంటే చెప్పాలని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను కోరారు.


సోనియాగాంఽధీ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో ఒకేసారి రైతులకు రూ.75 వేల కోట్ల మేరకు మాఫీ చేసిందని గుర్తు చేశారు. ‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే.. వాటిని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన రైతులను.. కేంద్ర మంత్రుల పిల్లలు తమ వాహనాలతో తొక్కించి హత్య చేశారు. దీనిపై చర్చకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు సిద్దమా?’’ అని సవాల్‌ విసిరారు. రైతుల పక్షాన ఖైదీ నెంబర్‌ 150 సినిమా తీసి హిట్‌ కొట్టిన చిరంజీవి.. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతు ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న ఆయన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు.. రైతుల గురించి ఎందుకు చెప్పలేకపోయారన్నారు. ఢిల్లీలో రైతుల ఆందళనలకు రాహుల్‌గాంధీ మద్దతు ఇచ్చారని, రైతుల పేరుతో సినిమాలు తీసి రూ.కోట్లు సంపాదించుకున్నవారు మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్‌ ట్వీట్లకే పనికొస్తారని విమర్శించారు. రుణమాఫీకి డబ్బులు ఎక్కడ తెచ్చారన్నది సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికే తెలుసునని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

Updated Date - Jul 20 , 2024 | 04:16 AM