Share News

CP Radhakrishnan: ఏడు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం!

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:55 AM

దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్‌ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు.

CP Radhakrishnan: ఏడు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం!

  • వర్సిటీలుగా ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు.. 4 టిమ్స్‌ ఆస్పత్రులకు నిమ్స్‌ హోదా

  • మునిసిపాలిటీల్లో కోఆప్టెడ్‌ మెంబర్ల పెంపు.. ములుగు ఇక మునిసిపాలిటీ

  • మూడు పంచాయతీలుగా భద్రాచలం.. మైనారిటీ కమిషన్‌లో జైన్‌లకు చోటు

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్‌ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనకు అప్పటి గవర్నర్‌ తమిళసైకి మధ్య తలెత్తిన వ్యక్తిగత స్పర్థ కారణంగా అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదం పొందిన పది బిల్లులు రాజ్‌భవన్‌లో చిక్కుకుపోయాయి. ఆ బిల్లుల పరిష్కారం కోసం గవర్నర్‌ను కలిసే ప్రయత్నం చేయడానికి బదులు కేసీఆర్‌ న్యాయమార్గాన్ని ఎంచుకొని హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు వేశారు. న్యాయస్థానాల సూచనల మేరకు అప్పటి గవర్నర్‌ కార్యాలయం 2023 ఏప్రిల్‌లో మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. మిగతా ఏడు బిల్లులను పరిశీలన పేరుతో పెండింగ్‌లో పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని, గవర్నర్‌ను ఒప్పించడంతో ఇప్పుడు ఏడు బిల్లులకు మోక్షం లభించింది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


బిల్లుల్లో ప్రధానమైనది.. గత గవర్నర్‌తో వివాదానికి కారణమైన ప్రైవేటు వర్సిటీల బిల్లు. గవర్నర్‌ ఆమోదం తెలపకపోవడంతో గురునానక్‌, శ్రీనిధి, మరికొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలకు వర్సిటీ గుర్తింపు లభించక వందలాది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరమైంది. వారిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం తనమీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని అప్పటి గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఇప్పుడు ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లుకు ఆమోదం లభించడంతో ఆ కళాశాలలన్నింటికీ విశ్వవిద్యాలయ హోదా లభించినట్లయింది. మరో ముఖ్యమైన బిల్లు మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు. పాత చట్టం ప్రకారం మున్సిపాలిటీల్లో ఇద్దరు, కార్పొరేషన్లలో నలుగురు కో-ఆప్టెడ్‌ సభ్యులను నియమించుకోవచ్చు. కొత్త చట్టం ప్రకారం వీళ్లకు అదనంగా ప్రత్యేక పరిజ్ఞానం, విశేష అనుభవం కలిగిన వారిని మున్సిపాలిటీల్లో ఇద్దరు, కార్పొరేషన్లలో ఆరుగురి వరకు నియమించుకోవచ్చు. ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ మరో సవరణ చేశారు. హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఓటర్ల జాబితాను జనవరితో పాటు ఏప్రిల్‌, మే నెలల్లో కూడా సవరించి పబ్లిష్‌ చేసేందుకు అనుమతించారు.


పంచాయతీరాజ్‌ చట్టానికి చేసిన సవరణలను కూడా ఆమోదించారు. అందులో భాగంగా భద్రాచలాన్ని మూడు మేజర్‌ గ్రామ పంచాయతీలుగా విభజించనున్నారు. మొదట మున్సిపాలిటీగా మార్చేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నించగా, షెడ్యూల్డ్‌ ఏరియా కావడంతో గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. దాంతో ఆ ఆలోచనను విరమించుకొని రెండు పంచాయతీలుగా విభజించే ప్రయత్నం చేసింది. చివరకు భద్రాచలం, సీతారాంనగర్‌, శాంతినగర్‌ గ్రామ పంచాయతీలుగా విభజిస్తూ చేసిన సవరణకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. టిమ్స్‌ పేరుతో రాజధాని నగరానికి నలువైపులా నిర్మిస్తున్న నాలుగు ఆస్పత్రులకు నిమ్స్‌, ఎయిమ్స్‌ మాదిరిగా స్వయం ప్రతిపత్తి హోదా దక్కనుంది. ఈ మేరకు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(టిమ్స్‌) బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఇది కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉభయ సభలు ఆమోదించిన బిల్లులే. గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.


నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఈ బిల్లు ఆమోదంతో టిమ్స్‌లకు ప్రత్యేక పాలకమండలి ఉంటుంది. వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర పారా మెడికల్‌ స్టాఫ్‌ను స్వయంగా నియమించుకునే అధికారం ఈ సంస్థలకు ఉంటుంది. సొంతంగా ఆదాయాన్ని, నిధులను సమకూర్చుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. ఒక్కో టీమ్స్‌లో 150 గదులు ప్రైవేటు వ్యక్తులకు వైద్య సేవలకు ఉపయోగిస్తారు. టిమ్స్‌లకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారు. నిమ్స్‌, ఎయిమ్స్‌ మాదిరిగా డైరెక్టర్స్‌ను నియమిస్తారు. పీజీ మెడికల్‌ సీట్లతో పాటు మెడికల్‌ రీసెర్చ్‌, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తారు. మైనార్టీ కమిషన్‌లో జైన్‌ సామాజిక వర్గానికికూడా ప్రాతినిధ్యం కల్పించారు. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు, బస్‌ భవన్‌ భూములు ఉండే ఆజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా బిల్లును కూడా గవర్నర్‌ పరిశీలించినట్లు తెలిసింది. కానీ, దానికి ఆమోద ముద్ర పడిందా లేదా అన్నది తెలియరాలేదు.

Updated Date - Jul 07 , 2024 | 03:55 AM