Share News

Yadadri Thermal Power Plant: యాదాద్రి ప్లాంట్‌లో 15,000 కోట్ల దోపిడీ!

ABN , Publish Date - Jul 30 , 2024 | 02:54 AM

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులోనూ మెగావాట్‌కు రూ.రెండున్నర కోట్ల చొప్పున అంచనా పెంచి.. మొత్తంగా రూ.రెండున్నర వేల కోట్లు దిగమింగిందెవరో లెక్కతేలాలన్నారు.

Yadadri Thermal Power Plant: యాదాద్రి ప్లాంట్‌లో 15,000 కోట్ల దోపిడీ!

  • భద్రాద్రి ప్లాంట్‌లో 2500 కోట్లు మింగింది ఎవరో?

  • దొరికినందునే కమిషన్‌ను రద్దు చేయాలంటున్నారు

  • సుప్రీంకోర్టు కమిషన్‌ను కొనసాగించమని చెప్పింది

  • కమీషన్లకు కక్కుర్తిపడే ఇండియా బుల్‌తో ఒప్పందం

  • బీహెచ్‌ఈఎల్‌ నుంచి బినామీలకు సబ్‌ కాంట్రాక్టులు

  • బీఆర్‌ఎస్‌ అబద్ధాలు ఆపకపోతే నిజాలు చెబుతా

  • శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం

  • తక్కువ సమయంలో చేసేందుకే భెల్‌కు ఇచ్చాం

  • అదానీకి ఇవ్వాలన్నది కాంగ్రెస్‌ ఆలోచన: జగదీశ్‌రెడ్డి

  • అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌ అబద్ధాలు: హరీశ్‌

  • 30వేల మంది టీచర్లతో 2న సీఎం సమావేశం

  • అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలతో 4న రేవంత్‌ భేటీ

  • ప్రముఖ సంస్థకు సినారె పేరు: జయంతి సభలో సీఎం

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులోనూ మెగావాట్‌కు రూ.రెండున్నర కోట్ల చొప్పున అంచనా పెంచి.. మొత్తంగా రూ.రెండున్నర వేల కోట్లు దిగమింగిందెవరో లెక్కతేలాలన్నారు. దొరికిపోతామని అర్థమైనందునే.. మాజీ సీఎం కేసీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లి విచారణ కమిషన్‌ను రద్దు చేయాలంటూ కోరారని ఆరోపించారు. కానీ, విచారణ అనంతరం సుప్రీంకోర్టు కమిషన్‌ను కొనసాగించాల్సిందిగా స్పష్టం చేసిందని తెలిపారు. సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే ఇప్పటికే చర్లపల్లి జైల్లో ఉన్నట్లుంది. జ్యుడీషియల్‌ విచారణ మేము అనలేదు. ఇదే సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొన్ని అంశాల్ని ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేం నిరూపించుకుంటాం.. విచారణకు ఆదేశాలివ్వాలని కోరారు.


దీంతో ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొనుగోలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఒప్పందం, యాదాద్రి 260 ఇన్‌టూ 4, సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీతో 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం, యాదాద్రి 4వేల విద్యుత్‌ ఒప్పందం బీహెచ్‌ఈఎల్‌కు ఇవ్వడంపై వారు అడిగితేనే ఆమోదించాం. కమిషన్‌ సమన్లు ఇచ్చినప్పుడు తమ వాదనలు వినిపిస్తే వాళ్ల నిజాయితీ బయటకు వచ్చేది. అక్కడికి వెళ్లకుండా ఆ కమిషనే వద్దు అని కోర్టుకు వెళ్లారు. హైకోర్టు వారి వాదనను తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళితే విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. కమిషన్‌ చైర్మన్‌ పట్ల అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మార్చేందుకు ప్రభుత్వాన్ని సూచించింది. ఈ రోజు సాయంత్రంలోగా కొత్త చైర్మన్‌ను నియమిస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.


  • రూ.వేల కోట్ల కుంభకోణం జరిగింది...

జార్ఖండ్‌లో 2400 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టుకు టెండర్‌ పిలిస్తే... కొరియన్‌ కంపెనీ, బీహెచ్‌ఈఎల్‌, ఇంకో కంపెనీ టెండర్‌లో పాల్గొన్నాయని, తెలంగాణలో అంచనాలకు ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్‌కు కాంట్రాక్ట్‌ ఇచ్చిన రోజే జార్ఖండ్‌ ప్రభుత్వం సూపర్‌ క్రిటికల్‌ టెండర్‌ పిలిచిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదే బీహెచ్‌ఈఎల్‌ 18ు తక్కువకు టెండర్‌ కోట్‌ చేసి అక్కడ పని దక్కించుకుందని పేర్కొన్నారు. 18ు తక్కువకు తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉండగా 4 వేల మెగావాట్ల విద్యుత్‌ పవర్‌ ప్రాజెక్టును బీహెచ్‌ఈఎల్‌కు అప్పజెప్పారని అన్నారు. రెండున్నరేళ్లలో తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉన్నందున బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చామన్నారని, కానీ.. టెండరు ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇప్పటి వరకు ఉత్పత్తి మొదలు కాలేదని గుర్తు చేశారు.


‘‘ఆనాడు రూ.7 కోట్లకు ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే.. ఇవ్వాళ రూ.10 కోట్లకు అంచనా పెరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. బీహెచ్‌ఈఎల్‌కు విద్యుత్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది. సివిల్‌ వర్క్స్‌ బ్యాలెన్స్‌ ఆఫ్‌ ప్లాంట్‌ వర్క్‌(బీఓపీ)ను మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఇప్పటివరకు దేశంలో జరిగింది ఇదే. కానీ, బీహెచ్‌ఈల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ నేతల బినామీలు, బంధువులు సివిల్‌ వర్క్స్‌ను కాంట్రాక్ట్‌ తీసుకున్నారు. దీంతో వేల కోట్ల రూపాయల మోసం జరిగింది. చివరకు కంకర, ఇసుక, వాచ్‌మెన్‌ల వరకు పార్టీ నాయకులకు, పార్టీ ఫిరాయించిన వారికి అప్పజెప్పారు’’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు.


  • ఇండియా బుల్స్‌తో అవినీతి ఒప్పందం..

‘‘గుజరాత్‌కు చెందిన ఇండియాబుల్‌ అనే కంపెనీ భద్రాద్రిలో సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీతో వెయ్యి మెగావాట్లకు పర్చేజ్‌ అగ్రిమెంట్‌ బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చింది. ఆ తర్వాత 2011లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. 2013లోగా దేశంలో ఉన్న అన్ని సబ్‌క్రిటికల్‌ పవర్‌ ప్రాజెక్టుల్ని, సూపర్‌ క్రిటికల్‌కి మార్చుకోవాలని చెప్పింది. ఆ సమయంలో బీహెచ్‌ఈఎల్‌కు కట్టిన డబ్బులు ఇవ్వాలని ఇండియాబుల్‌ అడిగితే.. అగ్రిమెంట్‌ అయినందున మెషినరీ ఏర్పాటు చేశామని చెప్పింది. ఎవరినైౖనా మాకు అప్పజెప్పి పైసలు తీసుకోమని చెప్పింది. కమీషన్లకు కక్కుర్తిపడి ఇండియా బుల్‌ నుంచి వెయ్యికోట్లు మెక్కి కాలం చెల్లిన సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీని మేం కొనుగోలు చేస్తామని వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారు. వీళ్లు బీహెచ్‌ఈఎల్‌కు డబ్బులు ఇస్తే బీహెచ్‌ఈఎల్‌ ఇండియాబుల్‌కు డబ్బు చెల్లింపులు చేసింది. ఇండియాబుల్స్‌కు, వీరికి మధ్య జరిగిన అవినీతి లావాదేవీల్లో భాగంగానే వీళ్లు బీహెచ్‌ఈఎల్‌ దగ్గరకెళ్లి కాలం చెల్లిన టెక్నాలజీని తెచ్చుకున్నారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు ఇవ్వాల్టికి నీళ్లు వస్తే మునుగుతోంది.


పర్యావరణ అనుమతి తీసుకోకకపోవడంతో ఎన్జీటీ 16 మంది అధికారుల్ని విచారించాలని ఆదేశించింది. వీళ్లు చేసిన తప్పుడు పనికి రిటైర్‌ అయిన అధికారులు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రాద్రి ఆరున్నర కోట్లకు ఒక మెగావాట్‌ ఉత్పత్తి చేయాల్సింది రూ.10 కోట్లకు అంచనా పెరిగింది. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు రూ.6వేల కోట్లతో పూర్తి చేయాల్సింది ఇవ్వాళ దాని అంచనా రూ.10 వేల కోట్లకు పెరిగింది. రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పని ఎనిమిదేళ్లు పట్టింది. యాదాద్రినీ ఇదే తరహాలో బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చి.. సివిల్‌ వర్క్స్‌ బినామీలకు ఇచ్చి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. వారి కోరిక మేరకు విచారణ కమిషన్‌కు ఆదేశించాం. కమిషన్‌ పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్న సమయంలో అర్థమై దొరికిపోయామని, జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని కమిషన్‌ మీద ఆరోపణలు చేసి కోర్టుకు వెళ్లారు. రూ.40 వేల కోట్ల మీద 18ు అంటే దాదాపుగా రూ.8 వేల నుంచి రూ.9 వేల కోట్లు తెలంగాణ విద్యుత్‌ శాఖకు నష్టం వచ్చింది’’ అని సీఎం వివరించారు.


  • అప్పటి పరిస్థితుల వల్లే బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం: జగదీశ్‌రెడ్డి

2017 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల్ని సబ్‌ క్రిటికల్‌లో పూర్తి చేయాలని కేంద్రం చెప్పిందని, ఆ నాడు మనకున్న విద్యుత్‌ అవసరాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో బీహెచ్‌ఈఎల్‌ను పిలిచి నాటి సీఎం వారితో మాట్లాడారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ‘‘సూపర్‌ క్రిటికల్‌ అయితే ఐదారేల్లు పట్టొచ్చు.. మేం తక్కువలో తక్కువ అంటే నాలుగేళ్లలో పూర్తి చేస్తామని బీహెచ్‌ఈఎల్‌ వాళ్లు చెప్పారు. 270 ఇన్‌టూ ఫోర్‌ మెషినరీ సిద్ధంగా ఉందని సివిల్‌ వర్క్స్‌ చేసుకుంటే ఇక్కడ బిగించుకుని రెండేళ్లలో పని పూర్తిచేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎన్జీటీ కేసు, కరోనా ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. సబ్‌క్రిటికల్‌, సూపర్‌ క్రిటికల్‌ పేరుతో చేస్తున్న ప్రచారం సరైంది కాదు. యాదాద్రి, భద్రాద్రి బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చామంటున్నారు. కొత్తగూడెంను కూడా బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చాం. దానిపై మాట్లాడటం లేదు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి పనులు తీసుకున్న కాంట్రాక్టర్లు, సబ్‌ కాంట్రాక్టర్లు ఎవరో నాకు తెలియదు. బీహెచ్‌ఈఎల్‌కు కాకుండా అదానీకి ఇవ్వాలన్నది మీ ఆలోచన. మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. కరెంట్‌ పోయిందని హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేస్తే... కేసులు నమోదు చేసి బెదిరిస్తున్నారు. వారి ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కూడా కరెంట్‌ సమస్యలపై మాట్లాడారు. ఆయనపైనా కేసులు పెడతారా? కోర్టులో జడ్జి, పీపీపై నమ్మకం లేకపోతే సాధారణ వ్యక్తి కూడా వారిని మార్చుకునే అవకాశం ఉంది. అలాగే విద్యుత్‌ కమిషన్‌పై కేసీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారు. వీళ్లు సుప్రీంకోర్టును తప్పుబడుతున్నారా?’’ అని జగదీశ్‌ రెడ్డి ప్రశ్నించారు.


  • కోర్టు నిర్ణయాల్ని తప్పుదోవ పట్టించేలా...

కోర్టును, కోర్టు నిర్ణయాల్ని తప్పుదోవ పట్టించేలా సభలో మాట్లాడుతున్నారని సీఎం రేవంత్‌ అన్నారు. చైర్మన్‌ను మార్చి విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు చెప్పడంతో ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ‘‘భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌కు 2017లో రూ.7290 కోట్ల 60 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. 2015లో ఒప్పందం చేసుకుని 2017లో పూర్తి చేస్తామన్నారు. అత్యవసరం ఉంది కాబట్టి సబ్‌క్రిటికల్‌తో ముందుకెళ్తున్నామన్నారు. 2022లో పూర్తయింది. రెండేళ్లలో పూర్తి కావాల్సింది ఏడేళ్లల పట్టింది. రూ.7290 కోట్లతో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు రూ.10,515 కోట్లకు పెరిగింది. దాదాపుగా 45ు అంచనాలుపెంచారు. మెగావాట్‌కు 9కోట్ల 73 లక్షలు పడ్డది. వేల కోట్ల రూపాయలు మింగి. విద్యుత్‌ సంస్థలపై భారం మోపి 81 వేల కోట్ల రూపాయల అప్పునకు కారణమయ్యారు.


యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కూడా బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసినప్పుడు 25వేల 99 కోట్ల రూపాయలకు ఒప్పందం చేశారు. 2015లో ఒప్పందం చేసి 2021లో పూర్తి కావాల్సి ఉంది. 2024 ఇంకా పూర్తి కాలేదు. ఇంకా రెండేళ్లు సమయం పడుతుంది. 45 రోజులు వృధా చేయదల్చుకోలేదని బీహెచ్‌ఈఎల్‌కు టెండర్‌ ఇచ్చారు. 25 వేల కోట్లతో జరిగిన ఒప్పందం 34 వేల 542 కోట్లకు పెరిగింది. ఇంకా పూర్తి కాలేదు కాబట్టి 40 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. 15 వేల కోట్ల రూపాయలు అంచనాలు పెంచి దోచుకున్నారు. ఈ రోజు ఒక్క మెగావాట్‌కు యాదాద్రికి 8 కోట్ల 64 లక్షలు అయింది. ఇది పెరిగి 10 కోట్లకు చేరే అవకాశం ఉంది. భద్రాద్రి 9 కోట్ల 73 లక్షల మెగావాట్లు అయింది. మెగావాట్‌కు రెండున్నర కోట్లు అంచనా పెరిగిందంటే రెండున్నర వేల కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులో మింగింది ఎవరో లెక్కతేల్చేందుకే కమిషన్‌ ఏర్పాటు చేశాం. 2015లో చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు 2023-24లో కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనను చూపించి తప్పించుకుంటున్నారు’’ అని సీఎం అన్నారు. ్ఙ


  • చర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం: జగదీశ్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘సీఎం ఎందుకు అంతలా ఆవేశపడ్డారో? ఎందుకు జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నారో? చర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్లీమళ్లీ గుర్తు చేసుకుంటున్నట్లున్నాడు. నాకు కూడా చంచల్‌గూడ జైలు గుర్తుంది. తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లిన. ఆయనకు చర్లపల్లే గుర్తుకు ఉంటది’’ అని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో సీఎం రేవంత్‌ జోక్యం చేసుకుంటూ, ‘‘సూర్యాపేట రైస్‌ మిల్లులో మిల్లర్లు పట్టుకుని ఎవరిని చెట్టుకు కట్టేశారో చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు’’ అని అన్నారు.


  • పదవులకోసం పెదవులు మూసుకున్నారు....

‘పదవుల కోసం పెదవులు మూసుకున్నవారు మీరు’ అని బీఆర్‌ఎస్‌ సభ్యులనుద్దేశించి సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘‘రాజశేఖర్‌రెడ్డి మంత్రి పదవి ఇస్తే ఊడిగం చేసింది మీరు. చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇస్తే ఊడిగం చేసింది మీరు. తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు 53 నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలనేది ఇదే సభలో నేను మాట్లాడిన. తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడిన. చంద్రశేఖర్‌రావు పార్లమెంట్‌లో ఎంత సమయం మాట్లాడింది రికార్డులు చూస్తే తెలుస్తుంది. ఎవరో త్యాగాలు చేస్తే అధికారంలోకి వచ్చిన వీరు మమ్మల్నా తప్పుబట్టేది? ఫాంహౌ్‌సలు కట్టుకుంది మీరు, నిబందనలు ఉల్లంఘించింది మీరు. బయట పెట్టినందుకు డిటెన్షన్‌ సెల్‌లో పెట్టారు.


విద్యుత్‌ మీద ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. కావాలంటే ప్రత్యేకంగా పదేళ్ల పరిపాలన మీద రాత్రి, పగలు చర్చకు మేం సిద్ధం. మీరు అబద్దాలు చెప్పడం ఆపకపోతే, నేను నిజాలు చెప్తా’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు, అప్పులు జనాభా దామాషా ప్రకారం తెలంగాణకు 42ు, ఆంధ్రప్రదేశ్‌ 58ు ఆస్తులు, అప్పులు పంపకాలు జరిగాయని సీఎం గుర్తు చేశారు. ‘‘విద్యుత్తు ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో విద్యుత్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందో అవి ఆ ప్రాంతానికే ఇచ్చే విధానం చట్టంలో ఉంది. ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని, సరిదిద్దాలని నాటి తెలంగాణ ప్రాంత పార్లమెంట్‌ సభ్యులు ఆ నాడు కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి దగ్గరికెళ్లారు. ఆయన సోనియాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌ వద్దకు వెళ్లి నచ్చజెప్పి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇప్పించారు. విభజన చట్టంలో లేని రాజ్యాంగంలోలేని ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చారు. ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూస్తే 36ు తెలంగాణకు 64ు ఏపీకి ఉండే. జైపాల్‌ రెడ్డి తీవ్రమైన కృషి చేషితో తెలంగాణను చీకట్ల నుంచి కాపాడారు’’ సీఎం పేర్కొన్నారు.


  • అందుకే హైదరాబాద్‌ విశ్వనగరంగా అవతరించింది...

‘‘వాళ్లేదో తెలంగాణకు విద్యుత్‌ వెలుగులు తెచ్చినట్లు, తద్వారా తెలంగాణ ధగధగ మెరుస్తున్నట్లు ఇంకా ఎంత కాలం ఊదరగొడతారు? ఉమ్మడి రాష్త్రంలో హైదరాబాద్‌లోపెట్టుబడులు తేవాలని, ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్‌ ఈ ప్రాంతంలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డా. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ రంగానికి, హైదరాబాద్‌కు ఒక్కక్షణం విద్యుత్‌ కోత ఉండరాదని తీసుకున్న నిర్ణయం వల్ల నిరంతర విద్యుత్‌తో ఐటీ, ఫార్మా, హోటల్‌ ఇండస్ట్రీలు అన్నీ నగరానికి వచ్చాయి. ఈ నగరంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగురోడ్డు, హైటెక్‌ సిటీ రావడం వల్ల హైదరాబాద్‌ విశ్వనగరంగా అవతరించింది’’ రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ నాడు తెలంగాణకు వస్తున్న అత్యధిక ఆదాయం ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ యూపీఏ-1, యూపీఏ-2 తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నగరానికి ఆదాయం పెరిగిందన్నారు.

Updated Date - Jul 30 , 2024 | 02:54 AM