Parigi: వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్‌పై కసరత్తు..
ABN , Publish Date - Jul 30 , 2024 | 03:00 AM
వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రూ.3500 కోట్లతో 145 కిలోమీటర్ల మేర నిర్మాణం
అసెంబ్లీలో సీఎంను కలిసిన రైల్వే సీఈ సుబ్రహ్మణ్యన్
పరిగి/కొడంగల్/హైదరాబాద్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై రైల్వే శాఖ చీఫ్ ఇంజినీర్ సుబ్రహ్మణ్యన్, సీఎంవో కార్యదర్శి షానవాజ్ ఖాసీం, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందనతోపాటు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణిక రెడ్డి తదితరులు సోమవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చర్చించారు.
వికారాబాద్ నుంచి పరిగి మీదుగా కొడంగల్, మక్తల్, కృష్ణ వరకు ఏర్పాటు కానున్న రైల్వే లైన్ రూట్ మ్యాప్‌ను రైల్వే అధికారులు సీఎంకు చూపించారు. సుమారుగా 145 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రైల్వే లైన్‌కు రూ.3500కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. రూట్‌మ్యా్‌పను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి.. పలు సూచనలు చేసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.