Skill University: ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో.. స్కిల్ యూనివర్సిటీ
ABN , Publish Date - Jul 09 , 2024 | 03:41 AM
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
గచ్చిబౌలి ప్రాంగణంలో ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలన్న సీఎం రేవంత్
వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయండి
అసెంబ్లీ సమావేశాలకు ముందే నివేదికివ్వండి
24 గంటల్లోనే తగిన నిర్ణయం తీసుకుంటాం
కోర్సులు, పాఠ్యాంశాలపై అధ్యయనం చేయండి
వర్సిటీ ఏర్పాటు వ్యవహారాల పర్యవేక్షణకు..
నోడల్ డిపార్ట్‌మెంట్‌గా పరిశ్రమల శాఖ: రేవంత్
పారిశ్రామికవేత్తలు, అధికారులతో సీఎం సమీక్ష
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఒకటి రెండు రోజుల ముందుగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతోపాటు, పారిశ్రామికరంగ ప్రముఖులకు సూచించారు. ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం 24 గంటల్లోనే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన స్కిల్ యూనివర్సిటీ అంశంపై సోమవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతోపాటు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగంణంలోనే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఐటీ కంపెనీలతోపాటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున ఈ-సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అధునాతన పరిజ్ఞానం అందించేలా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం పేర్కొన్నారు.
యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువు విధించుకుని ప్రతిపాదనలను రూపొందించాలని, అసెంబ్లీ సమావేశాలకు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉన్నందున.. ప్రతి ఐదు రోజులకోసారి సమావేశం కావాలని అన్నారు. సమీక్ష సమావేశానికి ముందు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను సీఎం రేవంత్ పరిశీలించారు.
ఐఎ్‌సబీ తరహాలో ప్రత్యేక బోర్డు..
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకుగాను.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్‌సబీ) తరహాలో ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేయాల్సి ఉంటుందని సమావేశంలో చర్చ జరిగింది. అయితే బోర్డు ఏర్పాటయ్యే వరకు సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని సీఎం నిర్ణయించారు. దీంతోపాటు యూనివరిటీలో ఏయే కోర్సులుండాలి, ఎలాంటి కరిక్యులమ్ అందుబాటులో ఉండాలనే విషయాలను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించాలన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు లభించేందుకు ఏయే నైపుణ్యాలపై కోర్సులను నిర్వహించాలనే విషయాన్ని కూడా ముందుగానే అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలా? ప్రభుత్వమే బాధ్యతలు చేపట్టాలా?
లేదా మరేదైనా విధానాన్ని అనుసరించాలా? అనే అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణుడైన కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని సూచించారు. యూనివర్సిటీ ఏర్పాటు వ్యవహారాల పర్యవేక్షణకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్ట్‌మెంట్‌గా ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, భారత్ బయోటెక్ హరిప్రసాద్, క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్‌రెడ్డి, ఐ ల్యాబ్స్ చైర్మన్ శ్రీనిరాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు పాలమూరు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ప్రజాప్రతినిధులతో రెండు దఫాలుగా మంత్రుల స్థాయులో సమీక్షలు జరగ్గా.. మంగళవారం మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం సమీక్ష ఏర్పాట్లపై సోమవారం జలసౌధలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్‌తో సమావేశమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా చేపట్టే, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
సదర్‌మట్ ప్రారంభానికి సీఎం రేవంత్
నెలాఖరున కార్యక్రమం.. పంద్రాగస్టున రాజీవ్ కెనాల్
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్‌మట్ బ్యారేజీ ఈ నెలాఖరున సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈలోగా బ్యారేజీలో మిగిలిన పనులను పూర్తిచేసి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి నదిపై రూ.520 కోట్లతో ఈ బ్యారేజీని కడుతున్నారు. ఇక సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా చేపట్టిన రాజీవ్‌గాంధీ కెనాల్‌ను ఆగస్టు 15న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.