Share News

Supreme Court: తొలుత మేమే అమలు చేస్తాం..

ABN , Publish Date - Aug 02 , 2024 | 03:42 AM

సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించినందున తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి షెడ్యూల్డు కులాల (ఎస్సీ) ఏబీసీడీ వర్గీకరణను అమలు చేసే బాధ్యత తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Supreme Court: తొలుత మేమే అమలు చేస్తాం..

  • ఉద్యోగ నోటిఫికేషన్లకూ వర్తింపు

  • వర్గీకరణకు ప్రతిపాదిస్తే నాడు నన్ను,

  • సంపత్‌ను సభ నుంచి పంపించారు

  • శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి

  • ఇదివరకే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకూ వర్తింపజేస్తాం

  • ఇందుకు కోసం అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తెస్తాం

  • సుప్రీంది గొప్ప తీర్పు.. : సీఎం రేవంత్‌

  • న్యాయం గెలిచింది: దామోదర

  • అఫిడవిట్‌ ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు: కడియం

  • సీఎంకు స్వీట్లు తినిపించిన నేతలు

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించినందున తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి షెడ్యూల్డు కులాల (ఎస్సీ) ఏబీసీడీ వర్గీకరణను అమలు చేసే బాధ్యత తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అవసరమైతే ఇదివరకే జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లకూ వర్గీకరణను వర్తింపజేయడానికి ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి.. మాదిగ, ఉప కులాల సోదరులకు న్యాయం చేసే బాధ్యతన తీసుకుంటాం అని చెప్పారు. వర్గీకరణ అత్యంత ప్రధానమైన అంశం అని.. దీనికి సభ ఏకాభిప్రాయానికి రావాలని, మాదిగ, మాదిగ ఉప కులాలకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు విపక్షాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం అని చెప్పారు. షెడ్యూల్డు కులాలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించడానికి గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది.


ఆ మేరకు సుప్రీం ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం శాసనసభలో సీఎం ఓ ప్రకటన చేశారు. ‘‘ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉప కులాలకు సంబంధించిన యువకులు కొన్ని దశాబ్దాల నుంచి పోరాటాలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నుంచి 27 ఏళ్లుగా జరుగుతున్న వర్గీకరణ పోరాటానికి ఇప్పుడు అనుకూల తీర్పు వచ్చింది. అప్పట్లో ఇదే శాసనసభలో మాదిగ, ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదిస్తే నాతో పాటు ఆనాటి శాసన సభ్యుడు సంపత్‌కుమార్‌ను సభ నుంచి బహిష్కరించారు. ఏబీసీడీ వర్గీకరణపై ప్రధానమంత్రిని కలవడానికి గత ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళతామని చెప్పి, తీసుకెళ్లకుండా మాదిగ సోదరులను మోసం చేసింది. 2023 డిసెంబరు 3న మా ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకున్నాక మా ఉప ముఖ్యమంత్రి సూచన మేరకు.. మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మా శాసనసభ్యులు, అడ్వొకేట్‌ జనరల్‌ బృందాన్ని ఢిల్లీకి పంపాం. సుప్రీం కోర్టు న్యాయ కోవిదులతో చర్చించాలని చెప్పాం.


సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. ఆ మేరకు సుప్రీంకోర్టు మాదిగ, మాదిగ ఉప కులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది’’ అని రేవంత్‌రెడ్డి వివరించారు. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు చాలా గొప్పదని, ఇంత ప్రధానమైన అంశం ప్రస్తావనకు వచ్చిన సమయంలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌ సభలో లేరు అని పేర్కొన్నారు. మంత్రి దామోదర్‌ రాజనర్సింహ మాట్లాడుతూ.. ఈ రోజు న్యాయం, ధర్మం గెలిచిందని పేర్కొన్నారు.


ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం తరపున అఫిడవిట్‌ ఇప్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, మందుల సామేలు, వేముల వీరేశం, లక్ష్మీకాంతరావు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సభలో ఈ అంశంపై మాట్లాడడానికి విపక్ష సభ్యులకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అనుమతించారు. కాగా అంతకుముందు సుప్రీం తీర్పు అనంతరం మంత్రి దామోదర, ఎమ్మెల్యే కడియం, ఇతర ఎమ్మెల్యేలు సీఎం చాంబర్‌లో రేవంత్‌ను కలిసి డప్పు దరువులతో కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు మిఠాయిలు తినిపించారు.


  • వర్గీకరణ తీర్మానం కాపీని కేసీఆరే మోదీకి ఇచ్చారు: హరీశ్‌

సుప్రీం కోర్టు ఽతీర్పును స్వాగతిస్తున్నామని, ఇది చాలా హర్షణీయమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే 2014 నవంబరు 29న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించామని చెప్పారు.తీర్మానం కాపీని కేసీఆరే స్వయంగా మోదీకి ఇచ్చారన్నారు. వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినందున వెంటనే కార్యాచరణను చేపట్టి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 70 ఏళ్లుగా సాగుతున్న వర్గీకరణ పోరాటానికి ప్రధాని మోదీ మద్దతిచ్చారని బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇది చరిత్రాత్మకమైన తీర్పు అని, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మజ్లిస్‌ పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు.

Updated Date - Aug 02 , 2024 | 03:42 AM