Share News

TG News : హైదరాబాద్‌లో వాన దడ

ABN , Publish Date - Aug 21 , 2024 | 02:59 AM

రాజధాని హైదరాబాద్‌లో వాన దడ పుట్టించింది. గంటన్నర పాటు కుండపోతతో కంగారు పుట్టించింది. మంగళవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. సరూర్‌నగర్‌లో 14.91 బాలానగర్‌లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

TG News : హైదరాబాద్‌లో వాన దడ

  • తెల్లవారుజామున కుండపోత వర్షం

  • చెరువుల్లా రోడ్లు.. కొట్టుకెళ్లిన కార్లు

  • రాంనగర్‌లో గల్లంతైన వ్యక్తి మృతి

  • 14 చోట్ల 10 - 12.5 సెం.మీ. వర్షం

  • ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండలోనూ జోరువాన

  • యాదాద్రిలో అత్యధికంగా 17 సెం.మీ.

  • నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

  • పలుచోట్ల ఇళ్లలోకి నీరు.. పంజాగుట్టలో పిడుగు పడి కారు, షెడ్డు ధ్వంసం

  • ఇంజనీర్ల బృందం సిద్ధంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

  • ప్రాణ, ఆస్తి నష్టం నివారించండి కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

హైదరాబాద్‌, సిటీ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లో వాన దడ పుట్టించింది. గంటన్నర పాటు కుండపోతతో కంగారు పుట్టించింది. మంగళవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. సరూర్‌నగర్‌లో 14.91 బాలానగర్‌లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూసు్‌ఫగూడలో 12.5, ఉప్పల్‌లో 12.1 సెం.మీ. వాన పడింది.

Untitled-1 copy.jpg

రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌, వెస్ట్‌మారెడ్‌పల్లి, ఎల్‌బీనగర్‌, గోల్కొండ లంగర్‌హౌస్‌, న్యూ నాగోల్‌, కంటోన్మెంట్‌, కుత్బుల్లాపూర్‌, నాంప్లల్లి, మల్లాపూర్‌, ముషీరాబాద్‌లలో పది సెం.మీ. వర్షం పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 20పైగా ప్రాంతాల్లో 9.5 సెం.మీ., 14 ప్రాంతాల్లో 10 నుంచి 12.5 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. వాన ధాటికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. యూసు్‌ఫగూడ, ఫిలింనగర్‌, వెంగళ్‌రావునగర్‌లలో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి.


పంజాగుట్ట కాలనీ సుఖ్‌నివాస్‌ అపార్ట్‌మెంట్‌పై పిడుగుపడి షెడ్డుతో పాటు కారు ధ్వంసమయ్యాయి. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం సెల్లార్‌లోని లైబ్రరీలోకి నీరు చేరింది. ముషీరాబాద్‌ రాంనగర్‌లో వరదలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందాడు. యూసు్‌ఫగూడలో బైక్‌పై వెళ్తున్న వాహనదారు, పార్శిగుట్ట చౌరస్తా సమీపంలో కారు కొట్టుకుపోగా డ్రైవర్‌, ప్రయాణికులను స్థానికులు కాపాడారు.

హైదరాబాద్‌లో భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా, యాదగిరిగుట్ట మండలంలో 17.03 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది.

నారాయణపేట జిల్లా మద్దూరులో 13.6 సెం.మీ., గద్వాల జిల్లా అయిజలో 13.3 సెం.మీ. వానపడింది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

బుధవారం ఉమ్మడి పాలమూరుతో పాటు మేడ్చల్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రంగారెడ్డి, నల్లగొండ, సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల, గురువారం నిర్మల్‌, జగిత్యాల, భూపాలపల్లి, ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌, కరీంనగర్‌, సిద్దిపేట, వరంగల్‌, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జలాశయాలు, చిన్న నీటి వనరులను పర్యవేక్షించేందుకు ఇంజనీర్ల బృందం సిద్ధంగా ఉండాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అవసరమైన చోట పాఠశాలలకు సెలవులివ్వాలని చెప్పారు.

Updated Date - Aug 21 , 2024 | 06:42 AM