Share News

Jaggareddy: సోనియా, రాహుల్‌, ఖర్గేల నాయకత్వంలో.. అత్యుత్తమ బడ్జెట్‌ పెట్టిన రేవంత్‌, భట్టి

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:04 AM

సోనియా, రాహుల్‌, ఖర్గేల నాయకత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అత్యుత్తమంగా ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

Jaggareddy: సోనియా, రాహుల్‌, ఖర్గేల నాయకత్వంలో.. అత్యుత్తమ బడ్జెట్‌ పెట్టిన రేవంత్‌, భట్టి

  • కేసీఆర్‌ది ఊహల బడ్జెట్‌.. మాది అభివృద్ధి బడ్జెట్‌.. రైతు ప్రభుత్వమని నిరూపించుకున్నం

  • హైదరాబాద్‌ దశ మారేలా రేవంత్‌ ఆలోచన.. 10 వేల కోట్ల కేటాయింపు మంచి నిర్ణయం

  • కేటీఆర్‌.. గ్యారెంటీల అమలుపై జనంలోకి వెళ్లి చూడు: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి): సోనియా, రాహుల్‌, ఖర్గేల నాయకత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అత్యుత్తమంగా ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. వ్యవసాయానికి రూ.72 వేల కోట్లు కేటాయించడం ద్వారా తమది రైతు ప్రభుత్వమని మరోమారు నిరూపించుకున్నట్లయిందని చెప్పారు. తెలంగాణ భవన్‌లో కూర్చుని మాట్లాడడం కాదని, హామీలు అమలవుతున్నాయో లేదో జనంలోకి వెళ్లి చూస్తే తెలుస్తుందని కేటీఆర్‌కు సూచించారు. గాంధీభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌ది ఊహల, ప్రచార బడ్జెట్‌ అయితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టింది వాస్తవాలు ప్రతిబింబించే బడ్జెట్‌ అని చెప్పారు. ‘‘భట్టి పెట్టిన బడ్జెట్‌ బిందెలో నీళ్లు ముంచుకుని తాగినట్లుగా ఉంది. కేసీఆర్‌ బడ్జెట్‌ చెరువులో నీళ్లు తెచ్చుకుని తాగినట్లుగా, దావత్‌కు వెళ్లి మటన్‌ బిర్యానీ తిని రావచ్చన్నట్లుగా ఉంటది.


దావత్‌ల మటన్‌ బిర్యానీ వండుతున్నమంటూ ప్రచారం చేస్తరు. పొయ్యిమీద గిన్నెలు పెడతరు గానీ అందులో మటన్‌ ఉండదు. మనం మటన్‌ కోసం ఎదురు చూస్తనే ఉంటం. బడ్జెట్‌ విషయంలో కేసీఆర్‌ ప్రజల్ని ఇట్లనే మోసం చేసిండు’’ అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. పప్పు, మజ్జిగ, ఊరగాయ ఉన్నయి.. ఇవి వేసుకుని తృప్తిగా తినండంటూ నిజం చెప్పినట్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వ బడ్జెట్‌ ఉంటుందన్నారు. మంచి బడ్జెట్‌ పెట్టిన రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం మంచి నిర్ణయమన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తారని, కార్మికులకూ మేలు జరుగుతుందని చెప్పారు. కేసీఆర్‌ రూ.7 లక్షల కోట్ల మేర అప్పులు చేయడానికి ప్రాధాన్యమిస్తే.. రేవంత్‌, భట్టి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ఆరు గ్యారెంటీలను గంగలో కలిపారన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తెలంగాణ భవన్‌లో కూర్చొని మాట్లాడడం కాదని, మంత్రి పొన్నంతో కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కితే; మంత్రి తుమ్మలతో కలిసి రైతుల వద్దకు వెళితే; భట్టితో కలిసి ప్రజల దగ్గరకు వెళితే పథకాలు అందుతున్నదీ లేనిదీ తెలుస్తుందని చెప్పారు. కేసీఆర్‌ ఒక విమర్శ చేస్తే దానికి రెట్టింపు చేసేవాళ్లు తమ దగ్గర వంద మంది ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Updated Date - Jul 26 , 2024 | 05:04 AM