Share News

TG: రైతులను ముంచినందుకే మిమ్మల్ని ఓడించారు

ABN , Publish Date - May 25 , 2024 | 03:58 AM

పదేళ్ల పాలనలో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నందునే ప్రజలు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు మొరుగుతున్నారని తాను అంటే, దానిని హరీశ్‌ వక్రీకరించి, రైతులను ఉద్దేశించి అన్నట్లుగా చెబుతున్నారని తుమ్మల తెలిపారు.

TG: రైతులను ముంచినందుకే మిమ్మల్ని ఓడించారు

  • మీ పాలనలో రైతుబీమా ఎత్తేశారు

  • రైతుబంధు పేరిట ఇతర పథకాలకు తిలోదకాలు

  • మీ తప్పులను సవరిస్తున్నాం

  • నా మాటలు వక్రీకరిస్తున్నారు

  • హరీశ్‌రావుపై మంత్రి తుమ్మల ఆగ్రహం

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల పాలనలో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నందునే ప్రజలు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు మొరుగుతున్నారని తాను అంటే, దానిని హరీశ్‌ వక్రీకరించి, రైతులను ఉద్దేశించి అన్నట్లుగా చెబుతున్నారని తుమ్మల తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ కూడా విడుదల చేయకుండా గత ప్రభుత్వం బకాయిలు పెడ్తే, ఇప్పుడు తాము వాటిని సరఫరా చేస్తున్నామని.. అయినప్పటికీ, బీఆర్‌ఎస్‌ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు.


పంటల బీమాను ఎత్తేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టిందని, రైతుబంధు పేరిట అన్ని పథకాలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులు విడుదల చేయకుండా, కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా చేసి రైతుల ఉసురు పోసుకున్నారని.. అందుకే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని మంత్రి తుమ్మల విమర్శించారు. పోయినసారి కంటే 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామని, పంటలబీమా పథకాన్ని తీసుకొస్తున్నామన్నారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ నాయకులు మొరగటం మానేసి వాళ్ల స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తే మంచిదని మంత్రి పేర్కొన్నారు.


రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్న పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ తదితర అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. వర్షాలతో పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్‌ పెరిగిందని అధికారులు తెలిపారు. 50,942 క్వింటాళ్ల జిలుగు, 11,616 క్వింటాళ్ల జనుము, 236 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలను అందుబాటులోకి తీసుకురాగా 20,518 క్వింటాళ్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారని, 30,400 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. 56 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, 7.22 లక్షల ప్యాకెట్ల విక్రయం జరిగిందన్నారు. వివిధ కంపెనీలకు సంబంధించి గత సంవత్సరం తాలూకు బకాయిలను అధికారులు ప్రస్తావించగా, వాటి విడుదలకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Updated Date - May 25 , 2024 | 03:58 AM