Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది
ABN , Publish Date - Aug 12 , 2024 | 03:46 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రదాయిని అయిన తుంగభద్ర డ్యామ్ గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది! శనివారం రాత్రి డ్యామ్ 19వ గేటును ఎత్తుతుండగా చైన్‌లింక్ తెగిపోవడమే ఇందుకు కారణం.
డ్యామ్‌లో 19వ గేటు ఎత్తుతుండగా తెగిన చైన్‌లింక్
వరదలో గేటు గల్లంతు.. ఇప్పటికిప్పుడు మరమ్మతు కష్టం
నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త గేటు అమర్చే చాన్స్
దిగువకు 65 టీఎంసీలు.. ఇప్పటికే నిండుగా శ్రీశైలం, సాగర్
పులిచింతల, ప్రకాశం కూడా.. వచ్చే నీరు సముద్రంలోకే!
బెంగళూరు/బళ్లారి/నాగార్జునసాగర్/కర్నూలు/మహబూబ్‌నగర్/అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రదాయిని అయిన తుంగభద్ర డ్యామ్ గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది! శనివారం రాత్రి డ్యామ్ 19వ గేటును ఎత్తుతుండగా చైన్‌లింక్ తెగిపోవడమే ఇందుకు కారణం. ఆ గేటు వద్ద వరద ప్రవాహ ఉధృతి పెరిగి ప్రాజెక్టుకు మరింత ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు మిగిలిన 32 గేట్లను 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తి 1.10 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వదులుతున్న నీరు సోమవారం ఉదయానికి లక్షన్నర క్యూసెక్కులకు పెరగొచ్చని.. తీరప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని బోర్డు అధికారులు హెచ్చరించారు.
నీటి ఉధృతి కారణంగా మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడడంతో.. శాశ్వత మరమ్మతులు చేసేందుకు స్పిల్ లెవల్ వరకూ డ్యామ్‌ను ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించి 65 టీఎంసీల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండిపోవడంతో తుంగభద్ర నుంచి వచ్చే నీరంతా సముద్రంలోకి వదిలిపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. మరమ్మతులకు సంబంధించి సూచనలు చేసేందుకు.. హైదరాబాద్‌కు చెందిన డ్యామ్ గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు, కర్ణాటక నీరావరి నిగమ్ లిమిటెడ్ (కేఎన్‌ఎన్‌ఎల్) ప్రాజెక్టు నిపుణుడు రాజేశ్ సహా హైదరాబాద్, బెంగళూరుకు చెందిన ప్రాజెక్టు నిపుణులు కూడా అక్కడకు చేరుకున్నారు.
డ్యామ్ ఖాళీ చేయకుండా గేటు మరమ్మతుపై వీరు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా.. 65 టీఎంసీల నీరు కిందకు వెళ్లడానికి కనీసం మూడ్రోజులు పడుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి. స్టాప్‌లాక్ ఏర్పాటు లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. వీటి ఏర్పాటు సర్వే కోసం 2020లో నాటి ఎస్‌ఈ వెంకటరమణ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేయడం గమనార్హం. మరోవైపు.. సమృద్ధిగా వానలు కురిస జూలైలోనే జలాశయాలన్నీ నిండిపోవడంతో ఈసారి ఖరీఫ్, రబీ సీజన్లలో సాగుకు, తాగునీటికి ఇబ్బంది లేదని రైతులంతా ఆనందంగా ఉన్నారు. ఇంతలోనే జరిగిన ఈ ఘటనతో వారి ఆనందం ఆవిరైంది.
రిస్కు తీసుకోవద్దు: జలసంఘం
డ్యామ్ గేట్లు పురాతనమైనవి కావడంతో పాటు మరమ్మతు చేసేందుకు పరిస్థితులు అనువుగా లేవు. ఆదివారం అప్పటికప్పుడు స్టాప్‌లాక్‌ను తయారుచేసి బిగించేందుకు అవకాశం లేకపోయింది. పైగా డ్యామ్ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉందని కేంద్ర జల సంఘానికి బోర్డు అధికారులు, ఏపీ ఇంజనీరింగ్ అధికారులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో.. నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నందున రిస్కు తీసుకోవద్దని జలసంఘం సూచించింది. నిర్దిష్ట స్థాయి వరకూ జలాలు కిందకు వెళ్లిపోయేదాకా ఆగి.. అప్పుడు స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వచ్చే ఏడాది నీటి ప్రవాహం తగ్గాక డ్యామ్ గేట్లు మొత్తం మార్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని బోర్డుకు స్పష్టం చేసింది. కాగా.. క్రస్ట్ గేటు తయారీ బాధ్యతను విజయనగరంలోని తుంగభద్ర స్టీల్, హిందుస్థాన్ స్టీల్, నారాయణ స్టీల్ తయారీ కంపెనీలకు అప్పగించినట్లు ఏపీ అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల వాటా 78 టీఎంసీలు..
ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలు.. తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలకు, కర్ణాటకకు సాగు, తాగునీరు అందించే జలజీవని తుంగభద్ర జలాశయం. దీని గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 135 టీఎంసీలు కాగా.. పూడిక చేరడంతో 105.788 టీఎంసీలకు కుదించారు. జూన్ 1 నుంచి మే 31 వరకు నీటి సంవత్సరంలో 212 టీఎంసీలు వినియోగించుకునేలా డిజైన్ చేశారు. కృష్ణా జలాల ట్రైబ్యునల్ అవార్డు-1 (బచావత్ అవార్డు) ప్రకారం..
కర్నూలు జిల్లాలో ఎల్లెల్సీ వాటాగా 24 టీఎంసీలు, కేసీ కాలువ వాటా 10 టీఎంసీలు, అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ కాలువ వాటాగా 35.5 టీఎంసీలు (మొత్తం 69.5 టీఎంసీలు)
తెలంగాణ రాష్ట్రం ఆర్డీఎస్ కాలువకు 8.5 టీఎంసీలు కలిపి తెలుగు రాష్ట్రాల వాటాగా 78 టీఎంసీలు
కర్ణాటక వాటాగా 134 టీఎంసీలు కేటాయించారు.
డ్యామ్‌లో చేరే వరదను అంచనా వేసి ఈ దామాషా ప్రకారం ఏటా పంపిణీ చేస్తారు.
సాగర్‌లో పర్యాటకుల రద్దీ
ఎగువ నుంచి వరదనీరు వస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడం.. అదే సమయంలో శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో చూసేందుకు వచ్చిన పర్యాటకులతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. దీంతో ప్రధాన డ్యామ్, జలవిద్యుత్ కేంద్రం మార్గాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. పర్యాటకుల వాహనాలతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సాగర్ ప్రధాన డ్యామ్ పరిసరాలతోపాటు.. బుద్ధవనం, ఎత్తిపోతల, కొత్తవంతెన, అనపు తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. నటి లయ తన స్నేహితురాలితో వచ్చి సాగర్ అందాలను వీక్షించారు.
వాక్ వేకు వెళ్లే గేటు తాళం పగలగొట్టిన ఏపీ అధికారులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై క్రస్ట్ గేట్లకు దిగువన ఉన్న వాక్ వే పైకి వెళ్లే గేటుకు వేసి ఉన్న తాళాన్ని ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పగలగొట్టారు. సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంతా తెలంగాణ పరిధిలో ఉండటంతో 26వ నంబరు గేటు అవతల కంట్రోల్ రూం పక్కన ఉన్న వాక్ వేకు వెళ్లే దారికి గేటు ఉండగా, ఆ తాళం తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారుల వద్ద ఉంటుంది.
ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు ఎస్‌ఈ స్థాయి నుంచి నాలుగో తరగతి ఉద్యోగి వరకు సుమారు 20మంది డ్యాం పైకి వచ్చి వాక్ వే గేటు తాళం పగులగొట్టి వాక్ వే పైకి వెళ్లారు. ఆ గేటుకు కొత్త తాళం ఏర్పాటుచేసి తమ వద్దే ఉంచుకున్నారు. ఈ ఘటనపై ఈఈ మల్లిఖార్జున్ రావును ఫోన్ లైన్‌లో వివరణ కోరగా.. ఏపీ అధికారులు దౌర్జన్యంగా గేటు తాళం పగులగొట్టి వాక్‌వే పైకి వెళ్లారని ఉద్యోగుల ద్వారా తెలిసిందన్నారు. దీనిపై నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులతో పాటు కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.