Share News

G.Kishan Reddy : విమోచనంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వక్రభాష్యాలు

ABN , Publish Date - Sep 18 , 2024 | 03:53 AM

తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు వక్రభాష్యం చెబుతున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

G.Kishan Reddy : విమోచనంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వక్రభాష్యాలు

  • ఆ రెండు పార్టీలవి దగాకోరు రాజకీయాలు

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు

  • మోదీ ప్రభుత్వం వంద రోజుల లక్ష్యం పూర్తి

  • పరేడ్‌గ్రౌండ్‌లో ఘనంగా విమోచన దినోత్సవం కాంగ్రెస్‌కు రజాకార్లపై ప్రేమ

  • పటేల్‌ గురించి రాహుల్‌, ప్రియాంక మాట్లాడరే?

  • ఎంఐఎం మెప్పు కోసమే ప్రజాపాలన దినోత్సవం

  • 6 గ్యారెంటీలను అటకెక్కించి ఏమార్చుతున్నారు

  • బీఆర్‌ఎస్‌ సమైక్యతా దినోత్సవం ఎందుకు: బండి

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు వక్రభాష్యం చెబుతున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రజాకార్ల పార్టీ అయిన మజ్లిస్‌ నాయకుల అడుగులకు ఈ రెండు పార్టీలు మడుగులు ఒత్తుతూ.. దగాకోరు రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. విమోచన దినోత్సవాన్ని కేంద్రమే అధికారికంగా నిర్వహిస్తుండడంతో.. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభు త్వం కూడా తూతూ మంత్రంగా.. ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘జాతీయ సమైక్యత దినం’ పేరిట, కాంగ్రెస్‌ ప్రభు త్వం ‘ప్రజా పాలన దినోత్సవం’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయని విమర్శించారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ విమోచన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పారా మిలటరీ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్‌గ్రౌండ్‌ వేదిక, అనంత రం మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఉద్యమాల్లోనే విమోచన పోరాటం మహోన్నతమైనదని, నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు సాగించిన పోరు దేశంలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోనే అపురూపమైన ఘట్టమన్నారు. ‘‘ప్రజలు ఎవరికి వారే స్వచ్ఛందంగా కత్తుళ్లు, గొడ్డళ్లు, వడిసెలు, రోకలి బండలు, కారం ముద్దలు పట్టుకుని, వాటినే ఆయుధాలుగా మలచుకుని, నిజాంపైన.. రజాకార్లపైన స్వాతంత్య్రం కోసం పోరాడారు.

అయితే విమోచన పోరాట చరిత్రను కుట్రతో తొక్కిపెట్టారు’’ అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆనాటి పాలకులను నిలదీసిన కేసీఆర్‌.. ముఖ్యమంత్రి అయ్యాక స్వరం మార్చారని విమర్శించారు. ‘‘తన మిత్రపక్షమైన మజ్లిస్‌ ఆదేశాలతో.. విమోచన దినోత్సవంపై కేసీఆర్‌ వక్ర భాష్యాలు చెప్పారు. నిజాం దురాగతాలు, రజాకార్ల అకృత్యాల నుంచి విముక్తి పొందిన 17 సెప్టెంబరు ముమ్మాటికీ ‘విమోచన దినోత్సవమే’. ఇందులో మరో వాదనకు తావులేదు’’ అని స్పష్టం చే శారు. నిజాం నియంతృత్వం నుంచి హైదరాబాద్‌ విముక్తి పొందిన రోజు ‘జాతీయ సమైక్యత దినం’ ఎలా అవుతుందని ప్రశ్నించారు. విమోచనకు, సమైక్యతకు సంబంధమేమిటని.. విమోచనకు, ప్రజా పాలనకు ఏం సంబంధముందని నిలదీశారు.


  • మోదీ ప్రభుత్వ 100 రోజుల లక్ష్యం విజయవంతం

2047 వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ లక్ష్యాలతో ముందుకెళ్తున్న మోదీ 3.0 ప్రభుత్వం.. తొలి వందరోజుల కోసం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మంగళవారం విజయవంతంగా పూర్తిచేసుకుందని కిషన్‌రెడ్డి చెప్పారు. ‘‘ఇదే స్ఫూర్తితో.. వచ్చే ఐదేళ్లు పనిచేస్తాం. వ్యవసాయం, మౌలికవసతులు సహా కీలక రంగాల్లో రూ.15 లక్ష ల కోట్ల పెట్టుబడులు పెట్టాం. పేదలు, మధ్యతరగతి, వెనుకడిన వర్గాల జీవితాలను మరింత సరళంగా మార్చేందుకు పలుకీలక సంస్కరణలు తీసుకొచ్చాం. సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ.. వ్యాపారానుకూల వాతావరణం(ఈజ్‌ ఆఫ్‌ డూ యింగ్‌ బిజినెస్‌) కల్పించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. 2024-25 ఖరీఫ్‌ సీజన్‌కు కనీస మద్దతు ధరను పెంచాం. రూ.28,600 కోట్లతో దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌సిటీలను ఏర్పాటుచేస్తున్నాం. తెలంగాణలోని జహీరాబాద్‌కూ స్మార్ట్‌సిటీ రాబోతోంది. 10 వందేభారత్‌ రైళ్లను ప్రారంభించాం. వీటిలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవే..!’’ అని 100 రోజుల్లో చేపట్టిన ముఖ్య కార్యక్రమాలను కిషన్‌రెడ్డి వివరించారు.

  • మోదీ జన్మదిన వేడుకలు

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీ కె.లక్ష్మణ్‌, పలువురు పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 03:55 AM