Uttam Kumar Reddy: ఎన్‌డీఎస్‌ఏ చెబితే బ్యారేజీల్లో నింపుతాం..
ABN , Publish Date - Jul 27 , 2024 | 03:29 AM
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) చెబితేనే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
నివేదిక వచ్చేదాకా నీటిని నిల్వ చేయం
అన్నారం, సుందిళ్లలో నిల్వ చేస్తేనే నీటి పంపింగ్‌కు అవకాశం
మేడిగడ్డ కుంగినప్పుడే నీటిని ఖాళీ చేయాలన్న ఎన్‌డీఎస్‌ఏ
సిగ్గులేకుండా మాట్లాడుతున్న కేటీఆర్ పేరును గోబెల్స్‌గా మార్చుకోవాలి
ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు 2-3 రోజుల్లో పంపింగ్: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) చెబితేనే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్‌డీఎ్‌సఏ సూచనలు పాటించకుండా మేడిగడ్డలో నీటిని నిల్వ చేస్తే.. బ్యారేజీకి ఏమైనా జరిగితే సమ్మక్క బ్యారేజీ కొట్టుకుపోతుందని తెలిపారు. దీంతో భద్రాచలంతోపాటు 40 గ్రామాలు నీట మునుగుతాయని, ఏటూరునాగారం కూడా ప్రమాదంలో పడుతుందని అన్నారు. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక వచ్చేదాకా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయబోమని స్పష్టం చేశారు. ఆగస్టు 2లోగా కన్నెపల్లి (మేడిగడ్డ)లో నీటి పంపింగ్ చేపట్టకపోతే 50 వేల మంది రైతులతో పంప్‌హౌ్‌సను ముట్టడించి, తామే పంపింగ్ ప్రారంభిస్తామని కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ శుక్రవారం జలసౌధలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
కేటీఆర్ కంటే ఎన్‌డీఎ్‌సఏకే ఎక్కువ తెలివి ఉందని తాము భావిస్తున్నామన్నారు. 2023 అక్టోబరులో మేడిగడ్డ కుంగినప్పుడే ఆ బ్యారేజీలో నీటిని ఖాళీ చేయాలని ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ఇచ్చిందని, దాంతో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే నీటిని ఖాళీ చేశారని గుర్తు చేశారు. మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయరాదని, ఫ్రీ ఫ్లో కండీషన్‌లో గేట్లు ఎత్తి ఉంచాలని ఎన్‌డీఎ్‌సఏ చెప్పిందని తెలిపారు. అన్నారంలో 11 మీటర్ల మేర (5 టీఎంసీలు), సుందిళ్లలో 9 మీటర్లు (4.5 టీఎంసీలు) నీటిని నిల్వ చేస్తేనే పంపింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని, కానీ.. ఈ రెండు బ్యారేజీల్లో 5 మీటర్ల మేర నిల్వ ఉన్న సమయంలోనే బ్యారేజీల్లో భారీగా సీపేజీలు ఏర్పడ్డాయని అన్నారు. ప్రస్తుతం మేడిగడ్డలో నీటిని నిల్వ చేయకున్నా పంపింగ్ చేయడానికి అవకాశం ఉందని, అయితే అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయాలంటే ఎన్‌డీఎ్‌సఏ సిఫారసులు కీలకమని పేర్కొన్నారు.
వేల కోట్లు దోచారు..
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్లు కొట్టేసి.. సిగ్గులేకుండా మాట్లాడుతోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాలకు తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరు ఇష్టం లేకనో, కాంగ్రె్‌సకు మంచిపేరు వస్తుందనో ప్రాణహిత-చేవెళ్లను పక్కనపెట్టారని, వ్యయం పెరిగితే కమీషన్లు పెరుగుతాయనే ఉద్దేశంతో రీడిజైన్ చేశారని ఆరోపించారు. అబద్ధాలను పదే పదే చెప్పి.. నిజాలుగా నమ్మించాలని చూస్తున్న కేటీఆర్.. తన పేరును గోబెల్స్‌గా మార్చుకోవాలన్నారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ పూర్తయిందని, కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం దోషులుగా తేలినవారిని వదలబోమని ప్రకటించారు.
ఏ సీఎం చేయని తప్పు చేసిన కేసీఆర్..!
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని తప్పును కేసీఆర్ చేశారని, రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే, ఒక్క స్టేజీ పంపింగ్‌తో ఎల్లంపల్లిలో నీటిని ఎత్తిపోసే గ్రావిటీ ప్రాజెక్టు ప్రాణహిత-చేవెళ్లను పక్కనపెట్టారని అన్నారు. సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందంటూ తప్పుడు సమాచారంతో తెలంగాణను తాకట్టు పెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆక్షేపించారు. కాళేశ్వరం వైఫల్యానికి కేసీఆర్ వన్‌మ్యాన్ షోనే కారణమని మండిపడ్డారు. బ్యారేజీ దెబ్బతిన్నప్పుడు కాంగ్రెస్ నేతలు సహా ఎవరినీ అక్కడికి అనుమతించలేదని, కానీ.. తమ ప్రజాపాలనలో బ్యారేజీలపైకి అనుమతిస్తున్నామని తెలిపారు.ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతున్నందున.. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని వదిలేసి.. మిగిలిన నీటిని రెండు, మూడురోజుల్లో పంపింగ్ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ఎల్లంపల్లి నీటిని పంపింగ్ చేసి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, అనంతగిరి, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ జలాశయాలను నింపుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్-1లో ఉన్న సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ కాంపోనెంట్‌లు మినహా.. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ దాకా అన్ని కాంపోనెంట్లను వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.
విహారయాత్రకే కేటీఆర్ టూర్: జీవన్‌రెడ్డి
కేటీఆర్ విహారయాత్ర కోసమే కాళేశ్వరం పర్యటనకు వెళ్లారని కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత జీవన్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలు వారికి తెలిసి ఉండి కూడా.. తప్పును కప్పి పుచ్చి... ప్రజల్ని తప్పుదోవ పట్టించేందురే ఈ యాత్ర తలపెట్టారని ఆరోపించారు. ఇకనైనా చేసిన తప్పునకు కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి కారణం బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. కాగా, తెలంగాణకు కల్వకుంట్ల శని వదలడంలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ధ్వజమెత్తారు. మేడిగడ్డ డిజైన్ లోపాలపై విచారణ జరుగుతుందని తెలిసీ.. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కేటీఆర్ రాజకీయానికి బయలు దేరారన్నారు.