Vikarabad : గంజాయితో పట్టుబడ్డ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్
ABN , Publish Date - Jul 31 , 2024 | 05:13 AM
ఓ ప్రముఖ టీవీ కార్యక్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు గంజాయి కేసులో వికారాబాద్‌లో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతని వద్ద 62 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వికారాబాద్‌లో అరెస్టు,
62 గ్రాముల గంజాయి స్వాధీనం
8 మరో ఘటనలో 50 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు
వికారాబాద్, మహేశ్వరం, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఓ ప్రముఖ టీవీ కార్యక్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు గంజాయి కేసులో వికారాబాద్‌లో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతని వద్ద 62 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు వికారాబాద్‌లోని పలు కూడళ్ల వద్ద మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
ఇందులో భాగంగా స్థానిక బీజేఆర్ చౌరస్తా సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ యువకుడిని గమనించి తనిఖీ చేశారు. వినోద్‌కుమార్ అలియాస్ అలెక్స్ అనే యువకుడి వద్ద గంజాయి లభ్యమవ్వడంతో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన అలెక్స్ ఓ టీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ కార్యక్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, అలెక్స్ పలువురు స్నేహితులతో (అమ్మాయిలు కూడా ఉన్నారు) కలిసి హైదరాబాద్ నుంచి వికారాబాద్ వచ్చి సోమవారం నుంచి ఓ లాడ్జిలో బస చేసినట్టు పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రఽధాన రహదారిలోని మహేశ్వరం గేటు సమీపంలో చేసిన తనిఖీల్లో 50 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
మహేశ్వరం గేటు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏపీకి చెందిన అనిల్, వెంకటలక్ష్మిని పోలీసులు సోమవారం తనిఖీ చేశారు. వారి వద్ద సుమారు రూ.13 లక్షల విలువైన 50 కిలోల గంజాయి దొరకడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసిన నిందితులు హైదరాబాద్‌లో అమ్మేందుకు వెళుతూ పోలీసులకు చిక్కారు.