Minister Seethakka: ఆ కుట్ర వెనక బీఆర్ఎస్ హస్తం ఉంది: సీతక్క సంచలన ఆరోపణలు..
ABN , Publish Date - Nov 30 , 2024 | 10:48 AM
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఫుజ్ పాయిజనింగ్ ఘటనల్లో వారి కుట్ర ఉందని సీతక్క ఆరోపించారు.
మహబూబాబాద్: తెలంగాణ ప్రభుత్వ వసతి గృహాల్లో వరస ఫుడ్ పాయిజన్ ఘటనలపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆహారం కల్తీ కావడం వెనక బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కుట్ర దాగి ఉందని సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకులతో సంబంధం ఉన్న కొంతమంది ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగానే ఆహారాన్ని కలుషితం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అందరూ కలిసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. రాజకీయం కోసం విద్యార్థులను బలి తీసుకునే కుట్ర జరుగుతోందని మంత్రి ధ్వజమెత్తారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. ఉద్యోగులకు కుట్రతో సంబంధం ఉందని తేలితే వారిని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు సీతక్క. కుట్ర వెనక ఏ స్థాయి నేతలున్నా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. రాజకీయ నేతలతో అధికారులు కుమ్మకైనట్లు తేలిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని ఘటనలపై విచారణ చేసి పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడతామని మంత్రి సీతక్క తెలిపారు.
కాగా, ఇటీవల కాలంలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్ వాడీల్లో కేంద్రాల్లో తరచూ ఫుజ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు ఆహారం కలుషితం అయ్యింది. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రి పాలవ్వగా.. చికిత్సపొందతూ ఓ విద్యార్థిని మృతిచెందింది. ఫుజ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం సైతం దాఖలైంది. దీంతో అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్.. ఫుడ్ పాయిజన్ కారణాలు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లాస్థాయి అధికారితో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనలపై విచారణ చేసి రిపోర్టును ఈ కమిటీ ప్రభుత్వానికి అందించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
TG News: పులి సంచారంపై అటవీ శాఖ అప్రమత్తం.. ఆ గ్రామాలకు అలర్ట్..
TG Govt: లగచర్ల భూసేకరణ... నిన్న రద్దు.. నేడు నోటిఫికేషన్