Share News

SC Gurukulams: ఎస్సీ గురుకులాల్లో భోజన కాంట్రాక్ట్‌.. మహిళా స్వయం సహాయక సంఘాలకు

ABN , Publish Date - Jul 13 , 2024 | 04:13 AM

రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో భోజన, శానిటేషన్‌ కాంట్రాక్ట్‌లను మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మహిళా గ్రూపులు తమను సంప్రదిస్తే పనులను అప్పగిస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు.

SC Gurukulams: ఎస్సీ గురుకులాల్లో భోజన కాంట్రాక్ట్‌.. మహిళా స్వయం సహాయక సంఘాలకు

  • అడ్మిషన్ల కోసం దళారులను ఆశ్రయించొద్దు

  • త్వరలోనే ఎస్సీ గురుకుల పరిధిలో ఎంబీఏ కాలేజీ

  • సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి వర్షిణి

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో భోజన, శానిటేషన్‌ కాంట్రాక్ట్‌లను మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మహిళా గ్రూపులు తమను సంప్రదిస్తే పనులను అప్పగిస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు. పనులకు సంబంధించిన బిల్లులను కూడా గ్రీన్‌ ఛానల్‌ ద్వారా చెలిస్తున్నామని చెప్పారు. గురుకులాలకు సంబంధించిన పలు అంశాలపై ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గురుకులాల్లో శానిటేషన్‌ నిర్వహిస్తున్నామని.. ఇందుకోసం ప్రత్యేకంగా శానిటేషన్‌ రెస్క్యూ ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక పాఠశాలలు, ఇంటర్‌ కాలేజీల్లో సీటు పొందిన వారు వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిస్తే.. మెరిట్‌ ప్రకారం బదిలీ చేస్తామని తెలిపారు.


ప్రవేశాలు, బదిలీలకు దళారులను ఆశ్రయించొద్దని సూచించారు. ఇక త్వరలోనే ఎస్సీ గురుకుల పరిధిలో ఎంబీఏ కాలేజీ కూడా రాబోతుందని, సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు కాబోతుందని వెల్లడించారు. గురుకులాల్లో మెనూ అమలుకాకపోయినా, ఇతర సమస్యలు ఉన్నా పిల్లలు నేరుగా రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసేలా ప్రత్యేక ఫోన్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఈ హెల్ప్‌లైన్‌ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని స్కూళ్లలో అమలు చేస్తున్నామని, త్వరలో అన్ని పాఠశాలల్లో తీసుకువస్తామన్నారు. ఇక ప్రపంచ స్థాయి చెస్‌ పోటీలకు భారతదేశం నుంచి మొత్తం 9 మంది ఎంపిక కాగా అందులో ఎస్సీ గురుకులం నుంచే నలుగురు ఎంపికయ్యారని అలుగు వర్షిణి తెలిపారు.

Updated Date - Jul 13 , 2024 | 04:13 AM