AP DGP:గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తాం
ABN , Publish Date - Jan 21 , 2025 | 09:55 PM
AP DGP Dwaraka Tirumala Rao: ఏపీలో గంజాయి విక్రయాలకు ఈగల్ టాస్క్ ఫోర్సును ఏర్పాటుచేసి అడ్డుకట్ట వేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకాతిరుమలరావు చెప్పారు. ఏపీవ్యాప్తంగా 100 ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగు ఉందన్నారు. సీజన్ టైంలో ఉన్న గంజాయి మొక్కలను తొలగించామని అన్నారు.

శ్రీ సత్య సాయి జిల్లా: గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేస్తామని ఏపీ డీజీపీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. మంగళవారం నాడు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనంలో సత్య సాయి బాబా మహా సమాధిని ద్వారకా తిరుమల రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ ద్వారకాతిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ... ఎక్కడ గంజాయి దొరికిన ఆంధ్రాలో ఏజెన్సీ ప్రాంతం అన్నది అపవాదు మాత్రమేనని చెప్పారు. ఏపీవ్యాప్తంగా 100 ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగు ఉందన్నారు. సీజన్ టైంలో ఉన్న గంజాయి మొక్కలను తొలగించామని డీజీపీ ద్వారకాతిరుమలరావు చెప్పారు.
ఒరిస్సా ప్రాంతం నుంచి మన రాష్ట్రంలో గంజాయి సరఫరా అవుతుందని తెలిపారు. అయితే ప్రక్క రాష్ట్రం పైకి తోసి వేయడం సరికాదన్నారు. మన రాష్ట్రంలో గంజాయి విక్రయాలకు ఈగల్ టాస్క్ ఫోర్సును ఏర్పాటుచేసి అడ్డుకట్ట వేస్తున్నామని చెప్పారు. రెడ్ శాండిల్ సైతం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తామని అన్నారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. సైబర్ నేరాలు పెరిగాయన్నది వాస్తవమని... సైబర్ నేరాలకు సైతం అడ్డుకట్ట వేస్తామని ఏపీ డీజీపీ ద్వారకాతిరుమలరావు పేర్కొన్నారు.