CM Chandrababu: సంక్రాంతి కొత్త వెలుగులు, ఆనందం నింపాలి
ABN , Publish Date - Jan 11 , 2025 | 01:30 PM
CM Chandrababu Naidu: ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు పండుగలు ఓ వారధిగా ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.ఎప్పుడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి రద్దీ ఎక్కువగా ఉందని అన్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. రద్దీ నియంత్రించటానికి కలెక్టర్లతో మాట్లాడతానని అన్నారు.
అమరావతి: ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ(శనివారం) మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలని అన్నారు. తాను అందుకే మా ఊరికి ప్రతీ సంక్రాంతికి వెళ్తున్నా అని చెప్పారు. సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే, మిగిలిన వారికి అది ప్రేరణగా ఉంటుందని అన్నారు. తాను మా ఊరు వెళ్లే సంప్రదాయానికి తన భార్య భువనేశ్వరినే కారణమని గుర్తుచేశారు. పాతికేళ్ల క్రితం ఆమె పట్టుబట్టి మొదలు పెట్టిన ఈ సంప్రదాయాన్ని క్రమo తప్పకుండా పాటిస్తున్నామని చెప్పారు. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒకచోట అంతా కలవటం, మాట్లాడుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. మనం ఆనందంగా పండుగ చేసుకునేటప్పుడు.. ఆ ఊరిలో పేదవారు కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. పేదవాడికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మిగిలినవారిపై ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ విధానం ప్రోత్సహించటానికే పీ4 కాన్సెప్ట్ పేపర్‌ను రేపు(ఆదివారం) విడుదల చేస్తామని అన్నారు. దీనిపై అన్నిస్థాయిల్లో చర్చ జరిగాక అమల్లోకి తెస్తామన్నారు. పీ4 విధానం బాగా చేసిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి రద్దీ ఎక్కువగా ఉందని అన్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. రద్దీ నియంత్రించటానికి కలెక్టర్లతో మాట్లాడతానని అన్నారు. ముఖ్య నగరాలకు చేరుకున్న వారిని వారి స్వగ్రామాలకు చేరుకునేందుకు కళాశాలలు, పాఠశాలల బస్సులు ఏర్పాటు చేసే సూచనను పరిశీలిస్తామని తెలిపారు. గత సంక్రాతితో పోల్చితే చాలా వరకూ రహదారులను మెరుగుపరిచామన్నారు. వచ్చే నెలాఖరుకు మిగిలిన రహదారులు బాగుచేస్తామని చెప్పారు. ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు పండుగలు ఓ వారధిగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరంగానూ హ్యాపీ సoడే లాంటి కార్యక్రమాలు ఈ సారి గ్రామస్థాయిల్లోనూ ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: క్షమాపణలు చెప్పాల్సిందే!
Vadde Obanna: రేనాటి వీరుడా వందనం!
Read Latest AP News and Telugu News